‘శ్రీరామిరెడ్డి’ కార్మికులకు పెండింగ్‌ వేతనాలివ్వాలి

May 26,2024 21:47

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు

అనంతపురం కలెక్టరేట్‌ : నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పని చేస్తున్న కార్మికులకు బకాయి పడ్డ వేతనాలు, పిఎఫ్‌ తక్షణమే చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల యూనియన్‌ గౌరవాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్‌ చేశారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల ధీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం స్థానిక జెవివి జిల్లా కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరువు జిల్లాలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రజల జీవనాధారంగా నిలిచిందన్నారు. 650 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తూ 600 మంది కార్మికులు వచ్చే వేతనాల్లో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. 15 ఏళ్లుగా కార్మికులు పనిచేస్తున్నప్పటికి వేతనాలు పెంపుదల జరగడం లేదన్నారు. మూడు ప్రభుత్వాలు మారినా కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపుదల చేయాల్సి ఉన్నా చేయడం లేదన్నారు. పైగా చేసిన పనికి వేతనాలు పొందాలంటే ప్రతి నెలా రోడ్లెక్కాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కార్మికుల మీద కమీషన్‌ల కోసం పని చేస్తున్న కాంట్రాక్టర్‌లు, హక్కులు కాపాడాల్సిన కార్మిక శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కార్మిక శాఖ పర్యవేక్షణ ఏమాత్రం లేదన్నారు. కాంట్రాక్టర్లకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వేతనాల కోసం వినతిపత్రాలు, నిరసనలు, ధర్నాలు చేసినా స్పందన రాకపోవడంతోనే కార్మికులు సమ్మెలు చేపడుతున్నారని తెలిపారు. సమ్మె నేపథ్యంలో అధికారులు హామీలిచ్చి కొంత మేరకు వేతనాలు ఇచ్చి సమ్మె విరమింపజేయడం, యధావిధిగా వేతనాలు బకాయిలు పడటం కార్మికులు రోడ్లు ఎక్కాల్సి రావడం తంతుగా మారిందని అన్నారు. ప్రభుత్వం ఒక రకంగా పొమ్మన లేక పొగ పెట్టే పద్ధతిని అనుసరిస్తోందని విమర్శించారు. తాగునీటి పథకం ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో నీటి కొళాయిలకు మీటర్లు అని అన్నారు. నిర్వహణ బాధ్యతలు అంగన్‌వాడీ ఏజెన్సీలకు అప్పగించి ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకునేందకు కుట్ర చేస్తోందన్నారు. తాగునీటికి సరఫరా పథకానికి నికర బడ్జెట్‌ కేటాయించడంలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. గ్రామీణ ప్రజల దాహార్థిని తీర్చే శ్రీరామిరెడ్డి పథకాన్ని ప్రభుత్వమే యధావిధిగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. . బకాయి పడ్డ వేతనాలు, పిఎఫ్‌ తక్షణమే చెల్లించాలన్నారు. కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌ శివశంకర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్‌ లైసెన్స్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ కార్మికుల వేతనాల్లో రూ.2 వేలు కోత విధించిన కాంట్రాక్టర్‌ శివశంకర్‌రెడ్డి నుంచి ఆ సొమ్మును తిరిగి కార్మికులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులపై బనాయించిన అక్రమ కేసులన్ని ఎత్తివేయాలన్నారు. కార్మికులను దూషిస్తూ అక్రమ తొలగింపులకు పాల్పడుతున్న కాంట్రాక్టర్‌ శివ శంకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎఐటియుసి, ఐఎఫ్‌టియు నాయకులు మల్లికార్జున, ఏసురత్నం, ఏపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భీమేష్‌, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి, నగర కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ప్రజా, కార్మిక సంఘాలుగా ఐక్య పోరాటాలు చేస్తామన్నారు. ఈ నెలలో నిరసన సమయంలో స్పందించిన కలెక్టర్‌ యూనియన్‌ నేత ఓబులుకు ఇచ్చిన హామీని నెలబెట్టుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఇది వరకు పని చేస్తున్న కార్మికులందరిని విధుల్లోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్లడం ఖాయమని యూనియన్‌ నాయకులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌కు సమస్యను వివరించి పరిష్కరించేలా విజ్ఞాపన పత్రాలు అందజేద్దామని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎర్రిస్వామి, కోశాధికారి వన్నూరుస్వామి, మాజీ కార్యదర్శి గంగాధర, రామాంజినేయులు, నాగరాజు, నరేష్‌, రామాంజినేయులు, ఆదిరెడ్డి, సిఐటియు నాయకులు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️