పెంఛన్‌..!

Jul 2,2024 09:38 #పెంఛన్‌..!

లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తున్న మంత్రి సవితమ్మ

     అనంతపురం : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభం అయ్యింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రూ.3వేల పింఛన్‌ను రూ.4వేలకు పెంచారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈకార్యక్రమాన్ని ఉదయం 6 గంటల నుంచే ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టిడిపి శ్రేణులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం కొంత సేపు సర్వర్‌ సమస్య రావడంతో పింఛన్ల పంపిణీకి ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత యథావిధిగా పింఛన్ల పంపిణీ కొనసాగింది. మొదటి రోజు 90 శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.

అనంత జిల్లాలో 2,89,508 మంది లబ్ధిదారులకు రూ.197.44 కోట్లు పంపిణీ

         అనంతపురం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. మంత్రి, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఈకార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అందించారు. ఉరవకొండ పట్టణంలోని పాతపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర ఎన్టీఆర్‌ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌లు స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఏప్రిల్‌, మే, జూన్‌ అరియర్స్‌ రూ.3,000, జులై నెల పింఛన్‌ రూ.4000 కలిపి మొత్తం రూ.7,000ను లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో వివిధ విభాగాల పరిధిలో 2,89,508 మంది లబ్ధిదారులకు రూ.197.44 కోట్లను పింఛన్ల రూపంలో అందించినట్లు కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌ తెలియజేశారు.

శ్రీసత్యసాయి జిల్లాలో 2,70,966మందికి రూ.184.70 కోట్లు పంపిణీ

        శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం కొనసాగింది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, టిడిపి నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకెళ్లి పింఛన్లను అందించారు. జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ, ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండల పరిధిలోని వేల్పుమడుగు గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, మడకశిర నియోజకవర్గం రొళ్ల మండల పరిధిలోని కరిదసానపల్లి, ఎం.రాయపురం, గుణేమొరుబాగల్‌, మొరుబాగులు గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బికె.పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమాల తిప్పేస్వామి, కలెక్టర్‌ అరుణ్‌బాబు, సబ్‌కలెక్టర్‌ అపూర్వ భరత్‌ పాల్గొన్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌ అరియర్స్‌ రూ.3,000, జులై నెల పింఛన్‌ రూ.4000 కలిపి మొత్తం రూ.7,000ను లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో వివిధ విభాగాల పరిధిలో 2,70,966మందికి రూ.184.70 కోట్లను లబ్ధిదారులకు పింఛన్ల రూపంలో అందించినట్లు కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలియజేశారు.

➡️