ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ ప్రధానం

May 6,2024 22:12

సమావేశంలో పాల్గొన్న అధికారులు

                     పుట్టపర్తి అర్బన్‌ : ఎన్నికల ప్రక్రియను బాధ్యతగా తీసుకొని శాంతిభద్రతలు పటిష్టంగా పర్యవేక్షించాలని ఎన్నికల ప్రత్యేక పోలీస్‌ పరిశీలకులు దీపక్‌ మిశ్రా ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల సంసిద్ధతపై జిల్లా ఎన్నికల పోలీస్‌ పరిశీలకులు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ అరుణ్‌ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, అడిషనల్‌ ఎస్పీలు, డీఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు అన్బు కుమార్‌, దీపక్‌ రామచంద్ర తివారి, ఖర్చుల పరిశీలకులు రీధం భాడ్జ, వి.నాయక్‌, అమిత్‌ కుమార్‌, అడిషనల్‌ ఎస్పీ విష్ణు తదితరులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని ఇందుకోసం అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లో 100 శాతం వెబ్‌ కాస్టింగ్‌ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రౌడీషీటర్లు, గొడవలకు దిగే వారిపై పూర్తి నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కలెక్టర్‌ అరుణ్‌ బాబు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. హోమ్‌ ఓటింగ్‌ కు సంబంధించి 38 టీములను ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలను చెక్కు పోస్టులు ఏర్పాటు చేశామని వాహనాలు తనిఖీలు చేపట్టామని ఎస్పీ పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ శాఖ సహదేవుడు, జిల్లాలోని డీఎస్పీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️