సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యం

Jun 19,2024 21:20
29న జాతీయ లోక్‌ అదాలత్‌పై సమీక్ష

 జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

                  పుట్టపర్తి అర్బన్‌ : సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధిని 2047 నాటికి నిర్మూలించడమే లక్ష్యంగా వైద్య సిబ్బంది పని చేయాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు కోరారు. బుధవారం ప్రపంచ సికిల్‌ సెల్‌ డే దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ఆవరణంలో జిల్లా వైద్య శాఖ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ వ్యాధిపై అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సికిల్‌ సెల్‌ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించాలన్నారు. 40 ఏళ్ల మధ్య గిరిజనుల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్‌ ఇవ్వాలన్నారు. ఈ వ్యాధి నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా అవగాహన దినోత్సవాన్ని పాటిస్తున్నారన్నారు. హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న వాళ్లకి ఈ వ్యాధి వస్తుందన్నారు. దీనిని నిరోధించేందుకు గిరిజనులకు స్కానింగ్‌ పరీక్షలు ప్రారంభించామని అందులో మొదటి దశ పూర్తి అయిందని అన్నారు. సకాలంలో ఈ వ్యాధి నిర్ధారించడం వల్ల చికిత్సను వెంటనే ప్రారంభించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ వ్యాధి తీవ్రంగా మారకుండా నిరోధించడమే ఉత్తమ మార్గమని కలెక్టర్‌ తెలిపారు. రక్త కణాలు సంఖ్య తగ్గడం (రక్తహీనత) కళ్ళు పసుపు రంగులో మారడం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తరచూ వచ్చే అంటువ్యాధులు, గర్భాధారణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, అవయవ వైకల్యం, పెరుగుదల సమస్యలు ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయన్నారు. ప్రతి ప్రాథమిక వైద్యశాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు 40 ఏళ్లు ఉన్న వారందరూ చేయించు కోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి ఎనుములపల్లి పిహెచ్‌సి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ మంజువాణి, గిరిజన సంక్షేమ అధికారి మోహన్‌ రావు, సంబంధిత వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఓబుళదేవర చెరువు:వారసత్వంగా వచ్చే ఎర్ర రక్త కణాల రుగ్మతల సమూహమైన సికిల్‌ సెల్‌ రక్తహీనత వ్యాధి పట్ల అవగాహన, జాగ్రత్త లేకుంటే ప్రాణాపాయమేనని వైద్యాధికారి డాక్టర్‌ కమల్‌ రోహిత్‌ పేర్కొన్నారు. ప్రపంచ సికిల్‌ సెల్‌ రక్తహీనత దినం సందర్భంగా బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తహీనతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రక్త కణాల సంఖ్య తగ్గడం, కళ్ళు పసుపు రంగులో మారడం, తీవ్ర కీళ్ల, ఒళ్ళు నొప్పులు, శ్వాసలో ఇబ్బంది, అలసట, గర్భధారణ సమయంలో సమస్యలు, అవయవ నష్టం ఈ వ్యాధి లక్షణాలని అన్నారు. జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి చిన్నపిల్లలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపారు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం,సత్వర చికిత్స ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుభాషిని, దిల్షాద్‌, విజయ కుమారి,మురళి,అరుణ జ్యోతి,హేమ, అంజలి, రాధ, బషీరా, వెలుగు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️