ఇసుకకు పాత విధానమే..!

           అనంతపురం ప్రతినిధి : ప్రభుత్వం మారినా ఇసుక దోపిడీలో మార్పు కనిపించడం లేదు. పాత విధానం కాకుండా కొత్త విధానాన్ని తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. గతంలో లాగా ప్రభుత్వం అమ్మే పద్ధతి కాకుండా ఉచితంగానే అందిస్తామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన అక్రమాలపైనా నివేదికలివ్వాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ పరిస్థితుల్లో పాత అక్రమాలు, పద్ధతులకు చెల్లుచీటి అని అందరూ భావించారు. కాని కొత్త ప్రభుత్వంలోనూ పాత పద్ధతులే కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తరలింపునకు సంబంధించి కొత్త ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఇంకా వెలువరించలేదు. అప్పుడే కొంత మంది ప్రజాప్రతినిధుల అనుయాయులు కొత్త యంత్రాలు, టిప్పర్లను దింపేశారు. నదుల్లోని ఇసుకను తోడటం మొదలు పెట్టారు. అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల తవ్వకాలు మొదలయ్యూయి. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ఒక నియోజకవర్గంలో రెండు యంత్రాలతో నిరంతరాయంగా తవ్వకాలు చేస్తున్నారు. కొన్ని వాహనాలను పోలీసులు పట్టుకుని స్టేషన్లకు సైతం తరలించారు. పక్క జిల్లా సరిహద్దునున్న మరో నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఇది చూసి అధికారులే నివ్వెరపోతున్నారు. ఇంకా పట్టుమని 15 రోజులు కూడా అధికారంలోకి రాకముందే ఈ రకంగా మొదలుపెడితే ఎలాగంటున్నారు. కొత్త విధానం వచ్చేలోపు తోడేసేందుకు సిద్ధం..ప్రభుత్వం ఇసుకపై కొత్త విధానాన్ని తీసుకొచ్చేలోపు అనుమతులున్నా.. లేకున్నా తమ పని తాము కానిచ్చేందుకు కొంత మంది నేతలు సిద్ధమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఆ తరువాత పరిస్థితి ఏరకంగా ఉంటుందో అంతలోపే కావాల్సినంత తోడేసి సొమ్ము చేసుకుంటే సరిపోతుందన్న ఉద్ధేశంతో పని మొదలు పెట్టారు. దీన్ని నిలువరించాల్సిన అధికార యంత్రాంగం ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉంది. ఎన్నికల సమయంలో నియమితులైన రెవెన్యూ, పోలీసు అధికారులు దీని పట్ల గట్టిగా వ్యవహరిస్తే ఎటువంటి పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తుందోనని భయపడిపోతున్నారు. జిల్లాలో ప్రధానంగా పెన్నా నది పరివాహక ప్రాంతమే ఎక్కువగా ఉంది. ఈ నదిలోనే అనేక చోట్ల యంత్రాలను ఏర్పాటు చేసుకుని టిప్పర్లు, లారీల్లో రోజుకు పదుల సంఖ్యలో వాహనాలు తరలిపోతున్నాయన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు పక్క రాష్ట్రానికి తరలిపోతోంది. కొన్ని చోట్ల మాత్రం పట్టుబడి సమస్య లేకుండా ఉండేందుకు ముందుగానే ప్రభుత్వ పనుల నిమిత్తం అనుమతులు తీసుకున్నట్టుగా అధికారులతో ఉత్తరాలు తీసుకుని మరీ తరలిస్తుండటం గమనార్హం. ఈ రకంగా చాలా చోట్ల యధేచ్చగా ఈ వ్యవహారం నడుస్తున్నా అధికార యంత్రంగం మిన్నకుండిపోతోంది. ఈ రకంగా సహజ వనరుల దోపిడీ పాలకులు మారినా తీరు మారలేదంటూ సామాన్యులు వాపోతున్నారు.

➡️