స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం

స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

           లేపాక్షి, హిందూపురం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోల్డ్‌ ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి.అరుణబాబు, ఎస్పీ మాధవరెడ్డి తెలియజేశారు. ఈవీఎం, వివిప్యాట్‌లు భధ్రపరచిన హిందూపురం బిట్‌ కళాశాల, లేపాక్షి మండలం చోళసముద్రం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లను శనివారం తనిఖీ చేశారు. భద్రతాపరమైన అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భధ్రత విషయంలో ఈవిఎంలు, వివిప్యాట్‌ల సురక్షిత తదితర అంశాలపై జిల్లా ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించామన్నారు. బిట్‌ కళాశాలలో మడకశిర,కదిరి, పెనుగొండ, హిందూపురం, హిందూపురం పార్లమెంట్‌ స్థానానికి సంబంధించిన ఈవిఎం, వివిప్యాట్‌లను భద్రపరిచామన్నారు. లేపాక్షి పట్టణ సమీపంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో పుట్టపర్తి, ధర్మవరం హిందూపురం పార్లమెంటుకు సంబంధించిన ఈవిఎం, వివిప్యాట్‌లను భద్రపరిచామన్నారు. జిల్లాలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూమ్‌లో వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో నిరంతర పరిశీలన ఉంటుందన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ చుట్టు పక్కల 144 సెక్షన్‌ అమల్లో ఉన్నదని ప్రజలు ఎవరూ ఈ ప్రాంతం చుట్టుపక్కల సంచరించరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, పుట్టపర్తి నియోజకవర్గం ఆర్వో భాగ్యరేఖ, ధర్మవరం నియోజకవర్గ ఆర్వో వెంకట శివసాయి రెడ్డి, మడకశిర నియోజకవర్గ ఎన్నికల అధికారి గౌరీ శంకర్‌ పాల్గొన్నారు.

➡️