టిడిపి వైసిపిలు బిజెపి చేతిలో కీలు బొమ్మలు

May 6,2024 22:14

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తులసిరెడ్డి

                       పుట్టపర్తి అర్బన్‌ : బీజేపీకి టిడిపి, వైసిపిలు కీలు బొమ్మలుగా మారి కట్టు బానిసలుగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్‌ తులసీరెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రాబోతుందన్నారు. అటు కర్నాటకలో 5 గ్యారంటీలతో, ఇటు తెలంగాణలో 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చామన్నారు. ఏపీలో పదేళ్ల తర్వాత తాము 9 గ్యారెంటీలతో ప్రజలలోకి వెళుతున్నామన్నారు. ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ టిడిపి, వైసిపిలకు ధీటుగా ఎన్నికలలో నిలిచిందన్నారు. కేంద్రంలో బిజెపి రైతు వ్యతిరేక బిల్లు, పౌరసత్వ బిల్లు, మణిపూర్‌ లో జరిగిన అరాచకంపై బిల్లు, 370 ఆర్టికల్‌ బిల్లు సభలో ప్రవేశపెడితే వాటికి టిడిపి వైసిపి మద్దతు తెలిపాయని విమర్శించారు. ఐదేళ్ల టిడిపి, మరో ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమన్నారు. పోలవరం ప్రాజెక్టు అటకెక్కించారని కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించలేదని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పోరాటాలతో సాధించుకుంన్నామని అలాంటి ఫ్యాక్టరీని కార్పొరేట్‌ సంస్థలకు తెగనమ్మేందుకు బిజెపి కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఈవిషయంపై టిడిపి, వైసిపి మౌనం పాటిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులలో వైసిపి, టిడిపికి ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్లే అని అన్నారు. మతతత్వ రైతు వ్యతిరేకి అయిన బిజెపిని ఓడించడానికి కాంగ్రెస్‌ వామపక్షాలతో పాటు కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఇండియా వేదికగా ఏర్పడి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైసిపి, టిడిపి పాలనలో విసిగిన ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఒక్క ఇండియా వేదికనని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కాంగ్రెస్‌ పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే పుట్టపర్తిలో జూనియర్‌, డిగ్రీ కళాశాలలతో పాటు పాలిటెక్నికల్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. టిడిపి, వైసిపి పాలనను ప్రజలు చూశారని ఒక్కసారి కాంగ్రెస్‌ కు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ మహిళ కన్వీనర్‌ ఖాజీ షకీరా, మండల కన్వీనర్లు పుట్ల గంగాధర్‌, పఠాన్‌ గౌస్‌బాషా, రవికుమార్‌, నజీర్‌, లక్ష్మీనారాయణ, నాయకులు శ్రీధర్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️