మొదలైన ప్రలోభాలు

     అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమవుతుండటంతో అప్పుడే ఓటర్లకు గాలమేసే ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో మొదలైంది. ఓటుకు రెండు వేల రూపాయల చొప్పున పంపిణీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఓట్లను కొనుగోలు చేసేందుకు అధికార పార్టీ నాయకుల ప్రయత్నించడంతో కళ్యాణదుర్గంలో వివాదం చోటు చేసుకుంది. అనంతపురంలోనూ కొంత మంది ఉద్యోగులు డబ్బులు తీసుకోకుండా తిరస్కరించారు. ఇంకా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ నడుస్తూనే ఉంది. ఈ ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఇప్పటికీ ఆగడం లేదు. ఇంతలోనే సాధారణ ఓటర్లకు డబ్బులు పంపిణీకి సమయత్తం అవుతున్నారు. అధికారపార్టీ ముఖ్య నేతల పర్యటన కూడా ఉండటంతో ఆ ప్రాంతాల్లో దీన్ని విజయవంతం చేసుకుని జనబలాన్ని నిరూపించుకునేందుకు డబ్బు పంపిణీని మొదలు పెట్టినట్టు ప్రచారం నడుస్తోంది. బూత్‌కు రూ.30 వేలు చొప్పున నేతలకు ఇస్తూ, ఓటర్లకు రెండు వేలు చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించి తెలుసోంది. ఇక మద్యం పంపిణీ గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రతి గ్రామం వారీగా నేతలకు మద్యం పంపిణీ బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో ప్రధాన నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. డబ్బు పంపిణీ కోసం ప్రత్యేకంగా బయట నుంచి బృందాలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. వారి ద్వారా ఓటరుకు డబ్బును చేర్చే ప్రక్రియను మొదలు పెట్టారు. ప్రచారాలు ముగియడానికి సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు రోజుల్లో ప్రచారాలు ముగియనున్నారు. ఆలోపే డబ్బు పంపిణీని పూర్తి చేసే ఆలోచన చేసే పనిలో నాయకులున్నారు. ఎందుకంటే చివరి నిమిషంలో చేర్చలేకపోతే ఫలితాలు తారుమారవుతాయన్న భయం నేతల్లో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రచారాలు ముగిసేలోపు డబ్బులను ఓటర్లకు చేర్చే ఆలోచన చేస్తున్నారు. కొంత మంది నేతలు మాత్రం డబ్బులు పూర్తి స్థాయిలో అందక అవస్థలు పడుతున్న వారూ ఉన్నారు. ఈ సమస్యను రాష్ట్ర ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లి ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేసుకునే పనిలోనూ పడ్డారు. సర్దుబాటు కాకపోతే ముందే చేతులెత్తేసే పరిస్థితి వస్తుందన్న గుబులూ ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ ఉంది. ఈ రకంగా సార్వత్రిక ఎన్నికల డబ్బుల సంచులు చేరుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాలున్నాయి. రెండింటి కలిపి ఆయా పార్టీల తరుపున పంపిణీకి డబ్బుల కట్టలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార వైసిపి, టిడిపి నుంచే ఈ పంపిణీ ఎక్కువ భాగముంది. పోటాపోటీగా రెండు పార్టీలు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఈ వారం రజుల్లో కోట్లాది రూపాయలు పంపిణీ జరగనుంది. ఈ రకంగా పంపిణీ కోసం తరలిస్తున్న డబ్బు అక్కడక్కడ పోలీసులకు పట్టుబడుతున్న విషయం కూడా తెలిసింది. ఇటీవల అనంతపురం నగరలో పట్టుబడిన రెండు కోట్ల రూపాయలు కూడా ఎన్నికల్లో పంపిణీ కోసం తరలిస్తున్నదేనన్న ఆరోపణలున్నాయి. పట్టుబడకుండా ఇతర ప్రాంతాలకు పెద్దమొత్తంలోనే చేరిందన్న ఆరోపణలున్నాయి. ప్రతి నియోజకవర్గంలో సగటున రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు పంపిణీ జరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.

➡️