ప్రధాన నిందితులను అరెస్టు చేయాలి

రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇస్తున్న రాజకీయ, విద్యార్థి నేతలు

         హిందూపురం : హిందూపురం పట్టణానికి చెందిన ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శి, యువ న్యాయవాది సంపత్‌ కుమార్‌ను దారుణంగా హత్య చేయించిన ప్రధాన నిందితులను వెంటనే అరెస్టు చేసి, ప్రభుత్వం సంపత్‌ కుమార్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. సంపత్‌కుమార్‌ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘం నాయకుడు, యువ న్యాయవాది సంపత్‌కుమార్‌ను సుఫారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించడం అత్యంత దారుణం అన్నారు. ప్రశాంతంగా ఉన్న హిందూపురం ప్రాంతంలో ఇలాంటి ఘటనలను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. సంపత్‌ కుమార్‌ను దారుణంగా హత్య చేయించిన న్యాయవాది న్యాయవాది పట్టాను రద్దు చేసి, అతన్ని బార్‌ కౌన్సిల్‌ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సంపత్‌ కుమార్‌ కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ఇవ్వని పక్షంలో హత్య చేయించిన న్యాయవాది ఆస్తులన్నింటినీ జప్తు చేసి అయినచేత నష్ట పరిహారం బాధిత కుటుంబానికి ఇప్పించాలన్నారు. అనంతరం రెవెన్యూ అధికారి గురుస్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరేష్‌, నాగార్జున, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్యామ్‌ కిరణ్‌, బీఎస్పీ శ్రీరాములు, ఆర్‌ఎస్‌పి ఎ.శ్రీనివాసులు, సిపిఎం నాయకులు ఎం.రమణ, ఎంఐఎం మున్నా, దళిత సమైక్య నాయకులు నారాయణ, కెవిపిఎస్‌ నాయకులు గోపాల్‌, రాయుడు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️