సబ్‌ జైలు నిర్వహణ ఇలానా..?

హిందూపురం సబ్‌జైలును తనిఖీ చేస్తున్న జిల్లా జడ్జి శ్రీనివాస్‌

       హిందూపురం : హిందూపురం సబ్‌ జైలు నిర్వహణ తీరుపై జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీలకు ఇవ్వాల్సిన గుర్తింపు కార్డులు, దస్త్రాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంపై జైలు సూపరింటెండెంట్‌ అంజి నాయక్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా జడ్జితో పాటు స్థానిక అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ సబ్‌ జైలును తనిఖీ చేశారు. తొలుత సబ్‌ జైలులో ఉన్న ఖైదీల వివరాలను జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలకు ఇవ్వాల్సిన గుర్తింపు కార్డు విషయంలో నిర్లక్ష్యంపై సంబంధిత హెడ్‌ వార్డర్‌ రామాంజినాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జైలు గదులను, మరుగుదొడ్లను జిల్లా న్యాయమూర్తి పరిశీలించారు. ఖైదీలకు ఆహార పదార్థాలు వండేందుకు సరఫరా చేస్తున్న నిత్యావసరాలు, బియ్యం నాణ్యతను పరిశీలించారు. మంచినీటి సదుపాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జైలు గదుల్లో లైటింగ్‌, ఫ్యాన్‌ సదుపాయాలు ఉన్నాయా.. లేదా.. అన్న విషయాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలు ఒక్కొక్కరితో ఏ కేసుల్లో నిందితులుగా ఉన్నారు… ఎప్పటి నుంచి జైలులో ఉంటున్నారు… న్యాయవాది ఉన్నారా.. లేదా..? అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సబ్‌ జైల్లో పనిచేస్తున్న మరో హెడ్‌ వార్డర్‌ హరినాథ్‌ విధులకు మద్యం సేవించి వచ్చినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూపరింటెండెంట్‌ అంజి నాయక్‌ను ప్రశ్నించారు. చర్యలు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు ఉన్నాయని జిల్లా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దస్త్రాల నిర్వహణలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, క్రమశిక్షణ వత్తి పట్ల అంకితభావం లేకపోవడం వల్లే ఇలా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక దశలో సస్పెన్షన్‌కు సిఫార్సు చేస్తానని హెచ్చరించారు. దీనికి తోడు ఉద్యోగుల హాజరు పుస్తకంలో కూడా సక్రమంగా సంతకాలు లేకపోవడం పట్ల జిల్లా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన ఉద్యోగి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోసారి తాను ఈ జైలును ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఏమైనా పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మద్యం సేవించి విధులకు హాజరవుతున్న హెడ్‌ వార్డర్‌ హరినాథ్‌ఫై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు జిల్లా న్యాయమూర్తి తెలిపారు. సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం సాయంత్రం అనంతపురం తీసుకురావాలని జిల్లా అధికారికి ఫోన్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జైలులో ఏమైనా సమస్యలు ఉంటే తమ దష్టికి తీసుకురావాలని సూచించారు. న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని నిందితులు ఎవరైనా ఉంటే వివరాలు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కోర్టుల సూపరింటెండెంట్‌లు భాస్కర్‌, రాధాకష్ణ, రామాంజనేయులు, లోక్‌ అదాలత్‌ హేమావతి పాల్గొన్నారు.

పెనుకొండ సబ్‌జైలు తనిఖీ

        పెనుకొండ : అనంతపురం డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఛైర్మన్‌, ప్రిన్సిపాల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి జి.శ్రీనివాస్‌ పెనుకొండ సబ్‌ జైలును ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌ జైలులోని ఖైదీల గదులు, మరుగుదొడ్లు, వంటగది, స్టోర్‌ రూమ్‌లను పరిశీలించారు. జైలు రికార్డులను తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.బుజ్జప్ప, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ముజీబ్‌ పసపల సయ్యద్‌, సబ్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.అజ్గర్‌ హుస్సేన్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

➡️