ఎన్టీఆర్‌తోనే వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత

సమావేశంలో మాట్లాడుతున్న నందమూరి బాలకృష్ణ

        హిందూపురం : మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి వాల్మీకులకు రాజకీయ గుర్తింపును ఇచ్చారని హిందూపురం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని జెవిఎస్‌ ఫంక్షన్‌ హాల్లో ఆదివారం సాయంత్రం టిడిపి ఎంపీ అభ్యర్థి పార్థసారథితో కలిసి వాల్మీకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు వాల్మీకులకు ఏ పార్టీ కూడా రాజకీయ గుర్తింపు ఇవ్వలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత వాల్మీకులను ఎంపీ, ఎమ్మెల్యేలను చేసి చట్ట సభల్లోకి పంపారన్నారు. నాటి నుంచి నేటి వరకు వాల్మీకులందరూ టిడిపికి అండగా నిలిచారన్నారు. అందువల్లే టీడీపీ గుర్తించి అనంతపురం ఎంపీ స్థానాన్ని హిందూపురం వాసి అంబికా లక్ష్మీనారాయణ కేటాయించినట్లు తెలిపారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం తనతో పాటు టిడిపి ప్రజా ప్రతినిధులు అందరూ చట్టసభల్లో గళం విప్పుతారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాల్మీకులందరూ టిడిపికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప, దేమకేతపల్లి అంజనప్ప, లీగల్‌ సెల్‌ అధ్యక్షులు శివకుమార్‌, పట్టణ అధ్యక్షులు రమేష్‌ కుమార్‌, మాజీ జెడ్పీటీసీ ఆదినారాయణ, వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు.

➡️