జనసేన నాయకుడిపై వైసీపీ దాడి

May 10,2024 22:05

పోలీసుస్టేషన్‌ ఎదుట విలేకరులతో మాట్లాడుతున్న బాధితులు

                     పుట్టపర్తి క్రైమ్‌ : జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అబ్దుల్లాపై వైసిపి నాయకులు దాడి చేసిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి చిత్రావతి రహదారిలో వాహనాలు నిలిపి గుట్టపైన ఎన్నికల ప్రచారం చేపట్టారు. అదే రహదారిలో నివాసముంటున్న తన ఇంటికి పోవడానికి తన వాహనానికి దారి ఇవ్వమని అబ్దుల్లా కోరగా ఆయనపై ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. అంతకుమునుపు అబ్దుల్లా ఒక షార్ట్‌ ఫిలింలో ఇంటర్వ్యూ ఇస్తూ ఎమ్మెల్యే దోపిడీదారుడని, భూకబ్జాలకు పాల్పడ్డాడని, రియల్‌ ఎస్టేట్‌ యజమానులతో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇదే అవకాశంగా భావించి అక్కడున్న ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. దాడి సమయంలో అబ్దుల్లా తో పాటు ఆయన సోదరుడు ఇద్దరు కలిసి పరిగెత్తుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకున్నారు. అక్కడ అబ్దుల్లా విలేకరులతో మాట్లాడుతూ తమపై దాడి చేయడం అమానుషమని ఓడిపోతామని భయంతోనే ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి చేయించాడని ఆరోపించారు.

చిత్రావతి రహదారిలో ఉద్రిక్తత : వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పట్టణంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. శుక్రవారం దుద్దుకుంట తో పాటు ఆ పార్టీ నాయకులు చిత్రావతి గుట్టపైన ఎన్నికల ప్రచారం చేపట్టారు. అయితే స్వయంగా ఎమ్మెల్యేనే అక్కడ కూర్చొని డబ్బులు పంపిణీ చేస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు తెలుగు యువత నాయకులు అడ్డుకోవడానికి వెళ్లగా అక్కడ వాదోపవాదాలు జరిగాయి. ఇరువర్గాల మధ్య జరిగిన పరస్పర వాదనలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏమవుతుందోనని ఆ ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి చక్కబడింది.

➡️