అంగన్వాడీల అలుపెరుగని పోరు

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌

ఇచ్ఛాపురం : ఎండలో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం యంత్రాంగం

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారానికి 37వ రోజుకు చేరింది. సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సమ్మెలో భాగంగా జ్యోతిరావు పూలే పార్కు వద్ద సమ్మె శిబిరంలో పొర్లు దండాలు పెడుతూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమ్మె సమంజసమైందని, నాలుగేళ్లుగా అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టారని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే జీవనం ఎలా సాగుతుందని ప్రశ్నించారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ జిఒ నంబరు 2ను ప్రభుత్వం జారీ చేయడం, నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించదని తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి మాట్లాడుతూ అంగన్వాడీలు 37 రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీని అమలు చేయాలన్నారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ జిఒ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయుకులు ఆర్‌.ప్రకాష్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సిహెచ్‌.అరుణ, వై.లీలారత్నకుమారి, డి.ముత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో బస్టాండ్‌ కూడలి వద్ద ఎండలో కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వ బెదిరింపు చర్యలకు భయపడేది లేదని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హైమ, బాలామణి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. టెక్కలి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయ ఆవరణలో సమ్మె శిబిరంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడారు. ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఆర్‌.ఆదిలక్ష్మి, బి.రమణమ్మ, ఇందుమతి, హెచ్‌.వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. సరుబుజ్జిలిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేకరించారు. పలాసలో కాశీబుగ్గ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎం.మంజుల, బి.సునీత, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

 

➡️