నియోజకవర్గాన్ని నంబరు 1గా తీర్చిదిద్దుతా

శ్రీకాకుళం నియోజకవర్గాన్ని జిల్లాలో ప్రథమ

మాట్లాడుతున్న గొండు శంకర్‌

ఎమ్మెల్యే గొండు శంకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

శ్రీకాకుళం నియోజకవర్గాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తనవంతు కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. నగరంలోని విశాఖ-ఎ కాలనీలో గల ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వాన కూటమి ప్రభుత్వం శ్రీకాకుళం నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో పెన్షన్‌ పెంపు ఒకటని, పెంచిన పెన్షన్‌ బకాయిలతో పాటు రూ.ఏడు వేల పెన్షన్‌ పంపిణీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుందన్నారు. పండగ వాతావరణంలో పెంచిన పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రాధాన్యతాక్రమంలో నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈనెల 26వ తేదీ నుంచి శాఖలా వారీగా సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తన పరిధి దాటి ఉన్న సమస్యలను సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరందేలా చర్యలు చేపట్టామని, వంశధార కుడి ప్రధాన కాలువను పరిశీలించి అడ్డంకులు గుర్తించామన్నారు. వాటిని తక్షణమే బాగు చేయాలని, లేకుంటే ఏడురోడ్ల కూడలిలో అమరణ నిరాహార దీక్ష చేస్తానని ఇరిగేషన్‌ అధికారులకు హెచ్చరించినట్టు తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని ఏడు నియోజకవర్గాల కంటే అదనంగా 350 క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచామన్నారు. శ్రీకాకుళం-ఆమదాలవలస ప్రధాన రహదారి పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. సుదీర్ఘకాలంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిపై మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణతో మాట్లాడినట్లు చెప్పారు. అసంపూర్తిగా నిలిచిపోయిన స్టేడియం నిర్మాణ పనులూ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నిలిచిపోయిన టెండరు పనులను పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. విలీన పంచాయతీల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. తనపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు సంరక్షకునిగానే ఉంటానన్నారు. ఎవరు ఎప్పుడు పిలిచినా తక్షణమే స్పందిస్తాననన్నారు.

 

➡️