అందని వేతనాలు.. తీరని కష్టాలు

అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారింది. ముఖ్యంగా

సమ్మె సమయంలో ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలు (ఫైల్‌)

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారింది. ముఖ్యంగా జీతాల చెల్లింపు విధానంలో ప్రభుత్వ తీరు వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సమ్మె కాలానికి రూ.కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని గత ఏడాది డిసెంబరు 12 నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకు 42 రోజులకు పైగా అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీలు, సహాయకులు సమ్మె చేశారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ప్రత్యక్షం గాను, పరోక్షం గాను అనేక ఆటంకాలు కలిగించారు. కనీస వేతనాలను రూ.26 వేలకు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌, ఆర్‌టిసి, ఛార్జీలకు తగ్గట్టు వేతనాలు పెంచాలని డిమాండ్‌తో సమ్మెబాట పట్టారు. వీటికి తోడు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల అప్పులపాలవు తున్నట్టు అంగన్వాడీలు గత ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీల కు గ్రాట్యూటీ అమలు, మినీ సెంటర్లలను తక్షణమే మెయిన్‌ సెంటర్లుగా మార్చి , మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని దీర్ఘకాలంగా వారు కోరుతున్న సమస్య. అలాగే రిటైర్మెంట్‌ బెపిఫిట్‌ రూ. 5 లక్షలకు పెంచడంతో పాటు పెన్షన్‌ కావాలని వారి ప్రధాన డిమాండ్లు. వాటిని సాధించుకునేందుకు సమ్మె చేస్తే… ప్రభుత్వం చర్చలకు పిలిచి సమ్మెను విరమించి సహకరించాల ని కోరింది. కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయని భావించి చర్చల ప్రతినిధులపై నమ్మకంతో సమ్మెను విరమిం చారు. సమ్మె విరమణ అనంతరం సమస్యల పరిష్కారానికి వేచి చూడాల్సిన దుస్థితి ఎదురైంది. అసలే అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న అంగన్వాడీ లకు సమ్మె కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సమ్మె కాలానికి వేతనం చెల్లిస్తామ ని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినా, ఎప్పటికి జమవుతాయో? తెలియని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4086 అంగన్వాడీ కేంద్రా లుండగా, కార్యకర్తలు 4013 మంది, సహాయకులు 3916 మంది విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె కాలంలో 42 రోజులకు వీరికి వేతనాలు చెల్లించలేదు. మార్చి నెల వేతనాల్లో కూడా సమ్మె కాలాన్ని లెక్కిస్తూ కోతలు పెట్టారు. సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని చర్చల సమయంలో అంగీకరించిన ప్రభుత్వ పెద్దలు ఈ వేతనాలను చెల్లించకుండా ఎన్నికల కోడ్‌కు ఒక్క రోజు ముందు జీవో విడుదల చేశారు. దీంతో కేంద్రానికి వచ్చే లబ్ధిదారులకు అవసరమైన ఆహారాన్ని అందించేందుకు కూరగాయలు, గ్యాస్‌, తదితరాలకు అప్పులు చేయాల్సి వస్తోందని అంగన్వాడీలు వాపోతున్నారు. దీనికి తోడు కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఆది నుంచీ అంగన్వాడీలకు అవస్థలు ఎదురవుతున్నాయి. నెలనెలా వేతనాలు అందుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా సమ్మె తర్వాత కక్షసాధింపు ధోరణి పెరిగింది. అధికారుల పర్యవేక్షకూ ఎక్కువైంది. గతంలో సెలవు అవసరమైతే సూపర్‌వైజర్లు మంజూరు చేసేవారు. సమ్మె అనంతరం సెలవుల మంజూరు కష్టంగా మారిందని, పనిభారం పెరగడంతో పాటు యాప్‌ బాధ తప్ప లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలకు, సహాయకులకు ఈ నెల వేతనంలో మూడు రోజుల జీతం మినహాయించి ఖాతాల్లో జమచేశారని ఆవేదన చెందుతున్నారు.

 

➡️