అడిఎస్‌సి ఊరింపేనా?

జిల్లాలో 14 బిఇడి కళాశాలలు ఉన్నాయి. కోర్సు రెండేళ్ల కాలపరిమితి

డిఎస్‌పి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు (ఫైల్‌)

ఇదిగో అదిగో నోటిఫికేషన్‌ అంటూ ప్రకటనలు

జిల్లా నుంచి ప్రతిపాదనలే పంపని వైనం

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్‌సి నోటిఫికేషన్‌పై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. ఇదిగో అదిగో అంటూ గత కొద్దినెలలుగా ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధ్యాయులను ఊరిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏటా డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇస్తామంటూ ఇచ్చిన మాటనూ ప్రభుత్వం తప్పింది. ఎన్నికల నేపథ్యంలో చివరి సంవత్సరంలోనైనా నోటిఫికేషన్‌ వస్తుందని అంతా భావించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం నోటిఫికేషన్‌ ఇస్తున్నామంటూ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎటువంటి ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో నోటిఫికేషన్‌ వస్తుందా? లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధిజిల్లాలో 14 బిఇడి కళాశాలలు ఉన్నాయి. కోర్సు రెండేళ్ల కాలపరిమితి కావడంతో ప్రతి రెండేళ్లకు సుమారు 700 నుంచి 800 మంది రిలీవ్‌ అవుతున్నారు. వీటితో పాటు 16 డిఇడి కళాశాలు ఉన్నాయి. ఒక్కో కళాశాల నుంచి 50 మంది చొప్పున ప్రతి రెండేళ్లకు 800 మంది రిలీవ్‌ అవుతున్నారు. వీరు కాకుండా ఇప్పటికే బిఇడి, డిఇడి కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు రానివారు వేలాది మంది ఉన్నారు. టిడిపి హయాంలో అక్టోబరు 25, 2018న చివరి సారిగా నోటిఫికేషన్‌ వెలువడింది. ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో వేలాది మంది నోటిఫికేషన్‌ కోసం ఆత్రంగా చూస్తున్నారు. డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నా ఆ వైపుగా అడుగులు మాత్రం పడటం లేదు. నోటిఫికేషన్‌ కోసం జిల్లాల నుంచి వివరాలు సైతం తీసుకోలేదని తెలిసింది. ఏడాదిన్నర కిందట అధికారులు పంపిన వివరాలు మినహా కొత్తగా ఏమీ పంపలేదని తెలుస్తోంది. దీంతో డిఎస్‌సి నోటిఫికేషన్‌ మాట ఉత్తదే అనే చర్చ జరుగుతోంది.కొత్త ఉద్యోగాల భర్తీ వద్దంటూ ప్రత్యేక ఆదేశాలుఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ ఇటీవల జారీ చేసిన ఆదేశాలు నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఏ ప్రభుత్వ శాఖలోనూ ప్రస్తుతం కొత్తగా ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపొద్దని సూచించినట్లు తెలిసింది. పోస్టుల అప్‌గ్రేడేషన్‌, కొత్త పోస్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. చివరకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను సైతం నియమించొద్దంటూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ నేపథ్యంలో డిఎస్‌సి నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం లేదని విద్యాశాఖకు చెందిన ఒకరిద్దరు అధికారులు అభిప్రాయపడ్డారు. నోటిఫికేషన్‌ ఇస్తామని ఊరించి ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ పలువురు నిరుద్యోగ అభ్యర్ధులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు వస్తుండటంతో నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చడానికే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారయణ నోటిఫికేషన్‌ ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలుడిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇక వచ్చే అవకాశం లేకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. సుమారు ఆరేళ్లుగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ లేకపోవడంతో బిఇడి, డిఇడి కోర్సులు చేసిన వారు ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేరిపోయారు. కొంతమంది ప్రయివేట్‌ ఉద్యోగాల్లో కుదురుకున్నారు. మరికొంత మంది వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గత కొద్ది నెలలుగా డిఎస్‌సికి సంబంధించి ప్రకటనలు చేయడంతో నిరుద్యోగ ఉపాధ్యాయుల అంతా ప్రిపరేషన్‌ మొదలు పెట్టేశారు. మరికొంత మంది కృష్ణ జిల్లా అవనిగడ్డలోని డిఎస్‌సి శిక్షణ కేంద్రానికి సైతం పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఉద్యోగాల భర్తీ వద్దంటూ ఆర్థికశాఖ జారీ చేసిన ఆదేశాలతో వారు నిరాశ నిసృృహల్లో కూరుకుపోయారు.

 

➡️