‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి

దేశ రక్షణను పణంగా పెట్టే అగ్నిపథ్‌ పథకాన్ని

ధర్నా చేస్తున్న ఎఐవైఎఫ్‌ నాయకులు

పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కొనసాగించాలి

ఎఐవైఎఫ్‌ డిమాండ్‌

ప్రజాశక్తి – పలాస

దేశ రక్షణను పణంగా పెట్టే అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ చేయాలని ఎఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.వాసుదేవరావు, కె.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. దేశ రక్షణ వ్యవస్థను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవడం మోడీ ప్రభుత్వానికి చెల్లిందని విమర్శించారు. కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉపయోగించుకుని తర్వాత ఇంటికి పంపి వారికి ఎటువంటి పెన్షన్‌, ఇతర సదుపాయాల్లేకుండా చేయడం చూస్తుంటే బిజెపికి దేశ రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ రక్షణ వ్యవస్థను ప్రైవేటు వారికి అప్పగించరాదని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమైనా, కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అగ్నిపథ్‌ పథకం ద్వారా వంద మందిని ఆర్మీలోకి తీసుకుంటే, వారిలో 75 మందిని నాలుగేళ్ల తర్వాత బయటకు పంపడం ద్వారా దేశ రక్షణకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుయుక్తులు మానుకుని, వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తూ జిఒ విడుదల చేయాలని, పాత పద్ధతుల్లోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్‌ నాయకులు వెంకటరావు, వల్లభరావు, గుణశేఖర్‌, సుందరరావు, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు.

 

➡️