అనధికార ఎత్తిపోతలపై కోర్టును ఆశ్రయిస్తా

వంశధార నదిపై అనధికారికంగా

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

  • రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు

వంశధార నదిపై అనధికారికంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాలతో శివారు భూముల రైతులకు అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం చేయడానికి కోర్టును ఆశ్రయిస్తామని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని పల్లిసారథి, చినవంక, డోకులపాడు, నగరంపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతు శివాజీ అసమర్థక కారణంగా శివారు గ్రామాల రైతాంగం నష్టపోయిందన్నారు. నాడు అనధికార ఎత్తిపోతల పథకాలను వ్యతిరేకించి ఉంటే, ఈరోజు రైతులకు ఇబ్బందులు ఉండేవి కావని చెప్పారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో జిల్లాకు నయాపైసా ఉపయోగం లేదన్నారు. వైసిపి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌కు ఇంగ్లీష్‌ రాదని అచ్చెన్నాయుడు విమర్శించడం తగదన్నారు. ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు. పేరాడ తిలక్‌ మాట్లాడుతూ జన్మభూమి కమిటీల దోపిడీకి పట్టం కడతారో, వాలంటీర్‌ వ్యవస్థతో ఇంటి ముంగిటకే సేవలందించే వైసిపి పాలన కావాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి ఉప్పరపల్లి నీలవేణి, జెడ్‌పి వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రతినిది పి.శ్రీనివాసరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, వైసిపి సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు ఉదరు కుమార్‌, పలాస ఎఎంసి చైర్మన్‌ పి.వి సతీష్‌, సర్పంచ్‌లు బత్తిన కుసుమ, వి.సరిత, డి.పద్మావతి, ఎంపిటిసిలు బి.రాజేశ్వరి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️