అన్ని అంగన్వాడీ కేంద్రాలు తెరవాలి

జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు తెరవాలని

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

  • కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు తెరవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అధికారులను ఆదేశించారు. ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు, సిడిపిఒలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3,358 అంగన్వాడీ కేంద్రాలకు గానూ 58 శాతం కేంద్రాలు తెరుచుకున్నాయని తెలిపారు. రాష్ట్ర సగటులో ఇది చాలా తక్కువని, బుధవారం నాటికి శత శాతం కేంద్రాలు తెరుచుకునేలా సంబంధిత యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందుబాటులో ఉన్నారని వారు ఆయా కేంద్రాలకు ఇన్‌ఛార్జీలుగా పనిచేయాలని ఆదేశించారు. నందిగాం మండలంలో ఒక్క కేంద్రం కూడా తెరుచుకోలేదన్నారు. రాజీ మార్గంలో మాట్లాడి కేంద్రాలు తెరుచుకునేలా ప్రయత్నించాలని, లేకుంటే బలవంతంగానైనా తాళాలు తెరవాల్సిందేనన్నారు. విఆర్‌ఒల సమక్షంలో పంచనామా నిర్వహించాలని సూచించారు. ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం సిడిపిఒల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, సచివాలయాల నోడల్‌ అధికారి వాసుదేవరావు, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️