అభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరం

రైతులు, మహిళలకు సకాలంలో రుణాలు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

  • కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రైతులు, మహిళలకు సకాలంలో రుణాలు అందజేయడం ద్వారా ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదపడాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ బ్యాంకర్లను కోరారు. ఎంఎస్‌ఎంఇలకు విరివిగా రుణాలు మంజూరు చేసి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో 2023-24 ద్వితీయ త్రైమాసిక జిల్లాస్థాయి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు నాటికి రైతులు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయకపోవడం వల్ల లక్ష్యాలు సాధించలేకపోయారని తెలిపారు. రైతులకు బ్యాంకర్లు సహకరించకపోతే ప్రైవేటు అప్పులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తుందని గుర్తు చేశారు కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం నిబంధనలు సడలించినా, కొన్ని బ్యాంకులు సహకరించడం లేదన్నారు. బ్యాంకర్ల సహకారం లేకపోవడంతోనే ఎంఎస్‌ఎంఇ లక్ష్యాల సాధనలోనూ వెనుకబడ్డామన్నారు. బ్యాంకర్లు త్వరితగతిన రుణాలు మంజూరు చేయకపోవడం వల్ల ప్రజలు పథకాలను వినియోగించుకోలేకపోతున్నారని పశు సంవర్థక శాఖ జెడి కిషోర్‌ కుమార్‌ తెలిపారు. టిడ్కో గృహ నిర్మాణాల రుణాల మంజూరుకు ఉన్న అడ్డంకులు తొలగించాలని గృహనిర్మాణ శాఖ అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ వచ్చే సమావేశం నాటికి బ్యాంకుల వారీగా మంజూరైన పథకాలు, చెల్లించిన రుణాలు, పెండింగ్‌ దరఖాస్తుల జాబితాలను అందజేయాలని ఎల్‌డిఎం ఎం.సూర్యకిరణ్‌ను ఆదేశించారు. సమావేశంలో యుబిఐ రీజనల్‌ హెడ్‌ ఎం.వి తిలక్‌, ఆర్‌బిఐ ఎజిఎం పూర్ణిమ, డిసిసిబి మేనేజర్‌ వరప్రసాద్‌, నాబార్డు డిడిఎం కె.వరప్రసాద్‌, పలు శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️