అభివృద్ధిని చూపించేందుకే ప్రాజెక్టుల పర్యటన

వైసిపి ప్రభుత్వంలో చేస్తున్న

నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ పనులను పరిశీలిస్తున్న వై.వి సుబ్బారెడ్డి, మంత్రులు

  • రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి – నౌపడ

వైసిపి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చూపించేందుకే ప్రాజెక్టులు పర్యటన చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి అన్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణ ప్రగతిని ప్రజాప్రతినిధుల బృందం కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, పోర్టు ఇంజినీర్లతో కలిసి గురువారం పరిశీలించింది. ముందుగా నార్త్‌, సౌత్‌ బ్రేక్‌ వాటర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు పోర్టులు ఉండగా మరో మూడు పోర్టులను వైసిపి ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ఈ పోర్టుల నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 75 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మూడు, నాలుగు నెలల్లో మూలపేట పోర్టులో ఓడలు ట్రయల్‌ రన్‌ చేసి, 2025 నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. మూలపేట పోర్టులో నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ పనులు 2,400 మీటర్లు కాగా ఇప్పటికే 1300 మీటర్ల వరకు పూర్తి చేశామన్నారు. బెర్తు నిర్మాణం కోసం ఫైలింగ్‌, డ్రెజ్లింగ్‌ పనులను త్వరలోనే చేపడతామన్నారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులతో ఏడాదికి 120-130 మిలియన్‌ టన్నుల సామర్థ్యం వరకు పెరుగుతుందన్నారు. ఒక్క మూలపేట పోర్టుతోనే 80 మిలియన్‌ టన్నుల సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే లబ్ధి చేకూర్చేందుకు స్వార్థపూరితంగా ప్రయత్నించారని విమర్శించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటును నుంచి విముక్తి కలిగించేందుకు వైసిపి ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తోందని చెప్పారు. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నంతో పోటీ పడే పరిస్థితి వస్తుందన్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నందున టిడిపి అబద్దాలు ప్రచారం చేసి, మోసం చేసే పరిస్థితి ఉందని ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. రాష్ట్ర మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ టిడిపి హయాంలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేసిన ప్రాజెక్టు ఏమిటో తెలియజేసి ఫొటో పెట్టాలని లోకేష్‌కు సవాల్‌ విసిరారు. రెండుసార్లు ఎంపీగా కింజరాపు రామ్మోహన్‌ నాయుడు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్‌, నర్తు రామారావు, వరుదు కళ్యాణి, జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, టెక్కలి వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️