అభివృద్ధిపై చర్చకు సిద్ధమే…

టిడిపి, వైసిపి ప్రభుత్వాల హయాంలో ఉత్తరాంధ్ర, జిల్లా అభివృద్ధిపై చర్చకు రావాలన్న మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ తెలిపారు. నగరంలోని టిడిపి జిల్లా

మంత్రి అప్పలరాజు సవాల్‌ను స్వీకరిస్తున్నా

అబద్దాలతో వైసిపి గ్లోబల్‌ ప్రచారం

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

టిడిపి, వైసిపి ప్రభుత్వాల హయాంలో ఉత్తరాంధ్ర, జిల్లా అభివృద్ధిపై చర్చకు రావాలన్న మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ తెలిపారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూట్యూబ్‌లో లైక్‌ల కోసం మంత్రి అలాంటి కామెంట్లు చేస్తుంటారని చెప్పారు. పోర్టు నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని, వ్యక్తిగత స్వార్థంతో ముడుపులు అందుకుని మధ్యలో వదిలేస్తే ప్రజలు క్షమించరన్నారు. నాలుగున్నరేళ్లుగా అబద్దాలను గ్లోబల్‌ ప్రచారం చేస్తూ వైసిపి నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఏటా జాబ్‌ కేలండర్‌ ప్రకటించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులను నయవంచనకు గురిచేశారని ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం అని హామీనిచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్‌ గానీ, వైసిపి ఎంపీలు గానీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలోనూ మాట్లాడడం లేదన్నారు. దాచుకుందాం, దోచుకుందామనే యావ తప్ప అభివృద్ధి జాడే లేదన్నారు. సామాన్యులపై పన్నుల రూపంలో మోయలేని ఆర్థికభారం మోపుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష, కెజిబివి ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, టిడిపి నాయకులు సింతు సుధాకర్‌, పి.ఎం.జె బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️