అర్హులమైనా ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఆపేశారు

తాము అర్హులమైనా రకరకాల సాంకేతిక కారణాలతో తమకు

వినతిపత్రం అందిస్తున్న ఆఫ్‌షోర్‌ నిర్వాసితులు

  • ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల ఫిర్యాదు’స్పందన’కు 273 వినతులు
  • ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలి
  • జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

తాము అర్హులమైనా రకరకాల సాంకేతిక కారణాలతో తమకు రావాల్సిన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ డబ్బులను ఆపేశారని ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్వాసిత కుటుంబాలు స్పందనలో ఫిర్యాదు చేశాయి. జెడ్‌పి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 273 వినతులు వచ్చాయి. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ వినతులు స్వీకరించారు. చీపురుపల్లి నిర్వాసిత గ్రామంలో సుమారు 350 కుటుంబాలు ఉండగా అందులో వంద మందికి ప్యాకేజీ అందలేదని తెలిపారు. వారిలో 50 మంది పేర్లను పరిశీలించి అర్హులుగా తేల్చి జాబితా తయారు చేసినా, నేటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్ల పునరావాస కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు డబ్బుల్లేక నిర్వాసిత గ్రామంలోనే ఉంటున్నామని వివరించారు. పునరావాస కాలనీలో కనీసం రోడ్లు, విద్యుద్దీపాలు, కాలవలు కూడా నిర్మించలేదని చెప్పారు. గ్రామస్తులు సొంత నిధులతో నిర్మించుకున్న ఆలయాలకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. ఎపి రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.మోహనరావు ఆధ్వర్యాన ఎన్‌.చిరంజీవులు, ఐ.కృష్ణారావు, పి.త్రినాథ్‌, ఎస్‌.మల్లేశ్వరి, ఎస్‌.సరోజని వినతిపత్రం అందించారు.ఎచ్చెర్ల మండలం తోటపాలెంకు చెందిన బలగ మోహనరావు తమ గ్రామంలో 130 ఎస్‌సి కుటుంబాలు ఉన్నాయని, గ్రామంలో శ్మశానవాటిక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. శ్మశానవాటికను మంజూరు చేయాలని కోరారు. నందిగాం మండలంలో పలువురు రైస్‌ మిల్లర్లు తేమశాతం, దిగుబడి తక్కువ వస్తుందనే పేరుతో 80 కేజీల బస్తాకు రెండు నుంచి మూడు కేజీలు అదనంగా తీసుకుంటున్నారంటూ కణితూరుకు చెందిన మెట్ట శ్యామలరావు ఆధ్వర్యాన పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల మండలం దుప్పలవలసకు చెందిన ఉప్పులూరి జగన్నాథ ప్రభాకర్‌ తనకు సంబంధించి దుప్పలవలస గ్రామం రెసిడెసియల్‌ ఎదురుగా ఉన్న 10 సెంట్లలో తన సొంత స్థలాన్ని వేరొకరి ఆక్రమించారని తనకు తన స్థలం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. నందిగాం మండలం అరసవెల్లి వెలమవీధికి చెందిన రోకళ్ల మహాలక్ష్మి తనకు వంశపారంపర్యంగా సంక్రమించిన ఐదెకరాల తోటను చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఆక్రమించుకుంటున్నారంటూ ఫిర్యాదు చేశారు. పొందూరు మండలం నందివాడకు చెందిన లింగాల కోటేశ్వరరావు తనకు సంబంధించిన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారని తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు. నందిగాం మండలం చెరుకుపల్లిలో పాత కాలువ పూర్తిగా పాడైపోయిందని, స్థానిక ఎంపిపి స్కూల్‌ నుంచి చెరువు వరకు కాలువ సర్వే చేసి కొత్త పనులకు అనుమతులు ఇవ్వాలంటూ గ్రామానికి చెందిన కోనారి రామారావు ఆధ్వర్యాన గ్రామానికి చెందిన పలువురు స్పందనలో వినతిపత్రం అందించారు.స్పందనకు 273 వినతులురెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి స్పందనకు మొత్తం 273 అర్జీలు వచ్చాయి. జెసి నవీన్‌ అర్జీదారుల సమస్యలను సావధానంగా విని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడారు. అర్జీల స్వీకరణ అనంతరం వివిధ శాఖలలో అర్జీలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందనలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, ప్రత్యేక ఉప కలెక్టర్‌ జయదేవి, డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విద్యాసాగర్‌ అర్జీలు స్వీకరించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️