అసాధారణ సవరణలపై ప్రత్యేక దృష్టి

ఓటర్ల ముసాయిదా జాబితా

మాట్లాడుతున్న ప్రత్యేక పరిశీలకులు శ్యామలరావు

  • ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలకులు జె.శ్యామలరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించిన అక్టోబరు 27 నుంచి ఇప్పటివరకు అందులో చేసిన మార్పులు, చేర్పులు, ఇతర సవరణలపై ఏ కోణంలో ప్రశ్న వేసినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలకులు జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఈనెల 26వ తేదీ లోగా అన్ని క్లయిమ్‌లను పూర్తి చేయాల్సి ఉన్నందున ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు ఆ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే ఇతర అధికారులు, బిఎల్‌ఒలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌తో కలిసి ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల ఆధారంగా ఓటర్ల జాబితా రూపకల్పనలో అవలంభిస్తున్న విధానాలు, చేపడుతున్న చర్యల గురించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్‌ వివరించారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ఓటర్లలో చైతన్యం కల్పించామని, యువ ఓటర్లను చేర్పించామని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను అనుసరించి తొలగింపులు, చేర్పుల ప్రక్రియను చేపడుతూ కచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పరిశీలకులు శ్యామలరావు మాట్లాడుతూ ఎలక్టోరల్‌ పాప్యులేషన్‌ రేషియో 750కి మించి ఉంటే మరోసారి విశ్లేషణ చేయాలని, ఆ సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చే వినతులపై సకాలంలో స్పందిస్తూ సమస్యను పరిష్కరించాలన్నారు. పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాలలో నాలుగు శాతం కంటే అధికంగా నమోదైన చేర్పులు, తొలగింపులు గురించి ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశం అనంతరం ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు బిఎల్‌ఒలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో సేకరించిన ఫారం 6, 7, 8 దరఖాస్తులను పరిశీలించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఇఆర్‌ఒలు నూరుల్‌ కమర్‌, ఎస్‌.భరత్‌ నాయక్‌, అర్‌.వెంకట్రామన్‌, సిహెచ్‌.రంగయ్య, బి.పద్మావతి, జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

➡️