‘ఆడుదాం ఆంధ్ర’తో మట్టిలో మాణిక్యాలు

మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికే

వాలీబాల్‌ సర్వీస్‌ చేస్తున్న కృష్ణదాస్‌

  • జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌
  • జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి – శ్రీకాకుళం

మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికే ఆడుదాం ఆంధ్ర పోటీలు అని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లాస్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను ఎమ్మెల్యే, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి బెలూన్లు, పావురాలను ఎగురవేసి, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి బుధవారం ప్రారంభించారు. తొలుత ఆయా జట్లను పరిచయం చేసుకున్నారు. బ్యాటింగ్‌, వాలీబాల్‌ పోటీలను సర్వీస్‌ చేస్తూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించేలా ఆయా జట్లు ఉత్తమ ప్రతిభను కనబరచాలన్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన సచివాలయం జట్లు నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రంలో పోటీల్లో పాల్గొని, విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతాయని చెప్పారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరమో తెలియజెప్పడానికి ఆడుదాం ఆంధ్ర గొప్ప క్యాంపెయిన్‌గా ఉపయోగపడిందన్నారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఆడుదాం ఆంధ్ర అనే గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. వైసిపి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కిట్లను అందజేసి భోజన, వసతి సదుపాయాలు కల్పించి క్రీడాకారులకు ఎలాంటి లోటు లేకుండా చూస్తోందని చెప్పారు. క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లే జిల్లా జట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డిఎస్‌డిఒ శ్రీధర్‌, జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వర్లు, సెట్‌శ్రీ సిఇఒ ప్రసాదరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్‌.నారాయణరావు, కోచ్‌ మాధురి, స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి రమణ, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్‌ ఉజ్వల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️