ఆర్‌టిసి అవుట్‌ సోర్సింగ్‌ డ్రైవర్‌పై దాడి

మందస మండలం కళింగదళ్‌ జంక్షన్‌ వద్ద ఆదివారం ఉదయం ఆర్‌టిసి

క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న శిరీష

ప్రజాశక్తి- పలాస

మందస మండలం కళింగదళ్‌ జంక్షన్‌ వద్ద ఆదివారం ఉదయం ఆర్‌టిసి అవుట్‌ సోర్సింగ్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న దేవరాజుపై దాడి జరిగింది. క్షతగాత్రుడు, మందస పోలీసుల కథనం మేరకు మందస మండలం గౌడు గురింటికి చెందిన వగాడి దేవరాజు ఉదయం నాలుగు గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై పలాస ఆర్‌టిసి డిపోకు వెళ్తుండగా మందస పోలీసుస్టేషన్‌కు చెందిన మఫ్తీలో ఉన్న పోలీసులు దేవరాజుకు వాహనం ఆపాలని చెప్పడంతో ఆపకుండా వెళ్లిపోవడంతో సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఐదుగురు పోలీసులు కళింగదళ్‌ జంక్షన్‌ వద్ద కర్రలతో మూకొమ్మడిగా దాడి చేశారు. దీంతో గాయాలతో మందస పోలీసు స్టేషన్‌కు వెళ్ళి తనకు న్యాయం చేయాలని స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా గత మూడు నెలల క్రితం వైసిపి నుంచి టిడిపిలో చేరడంతో బుడారసింగ్‌ సర్పంచ్‌ సురేష్‌ పాణిగ్రహి పోలీసులతో తనపై దాడి చేయించారని దేవరాజు ఆరోపించారు. అనంతరం క్షతగాత్రుడును హరపురం సిహెచ్‌సికి తరలించి వైద్యసేవలు అందించారు. విషయం తెలుసుకున్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, టిడిపి నాయకులు, అనుచరులతో కలిసి హరపురం సిహెచ్‌సికి చేరుకొని బాధితుడును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసిపి నేతల ప్రోద్బలంతోనే పోలీసులు దాడి చేశారని ఆమె ఆరోపించారు. వైసిపిని వీడి టిడిపిలో చేరిన వారందరిపైన బుడారసింగి వైసిపి నాయకుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఘటనకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ తెలిపారు. దేవరాజుపై దాడిచేసిన కానిస్టేబుళ్లు ఎస్‌.రవికుమార్‌, సంతోష్‌ కుమార్‌, కృష్ణారావు, కేశవరావుపై కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు కోసం ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరిగిందని మందస ఎస్‌ఐ తెలిపారు.

 

➡️