‘ఆశా’లపై వేధింపులు ఆపాలి

ఆశాలపై జిల్లా అధికారులు

మాట్లాడుతున్న ధనలక్ష్మి

  • ఎపి ఆశావర్కర్ల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఆశాలపై జిల్లా అధికారులు చేస్తున్న వేధింపులు వెంటనే ఆపాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో జిల్లా ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్యలు జిల్లాలో ఆశావర్కర్లు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అధికారులు ఆశావర్కర్లని బానిసలుగా చూస్తున్నారని అన్నారు. ఆశా వర్కర్లతో సబ్‌ సెంటర్లను, సచివాలయాల్లో ఉండే హెల్త్‌ అసిస్టెంట్‌కు సంబంధించిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఊడ్చే పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సెంటర్లలో కూర్చోవాలని చెప్పడం, రికార్డుల్లో సంతకాలు చేయాలని చెప్పడం సరైంది కాదన్నారు. స్వీపరు పనులు చేయాలన్న నిబంధన ఎక్కడా లేదని అన్నారు. ఆశావర్కర్లతో వెట్టిచాకిరీ పనులు చేయించుకోమని జిఒ వచ్చి ఉంటే చూపాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.నాగమణి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతి, నాయకులు కె.లక్ష్మి, జి.కృష్ణవేణి, ద్రౌపది, ప్రేమలత పాల్గొన్నారు.

➡️