ఆ నిర్ణయం సరికాదు

భూ హక్కు చట్టాన్ని న్యాయస్థానం పరిధి నుంచి తప్పించడం

సమావేశంలో మాట్లాడుతున్న అప్పలసూర్యనారాయణ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

భూ హక్కు చట్టాన్ని న్యాయస్థానం పరిధి నుంచి తప్పించడం తగదని, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. నగరంలోని ఎన్‌జిఒ హోంలో శ్రీకాకుళం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థలను మళ్లీ పునరుద్ధరించినట్లు అవుతుందన్నారు. దీనిపై విస్తతంగా చర్చలు చేసి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచబ్యాంకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సర్వే 2019 ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్‌ విషయంలో ఇండియా 154వ స్థానంలో ఉందన్నారు. 66 శాతం సివిల్‌ కేసులు, భూమికి సంబంధించిన కేసులు కోర్టులో ఉన్నాయని, వీటి సత్వర పరిష్కారం కోసం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ చట్టాన్ని తెచ్చామని ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్తోందని దుయ్యబట్టారు. సివిల్‌ కేసులు సత్వర పరిష్కారం కావాలంటే ప్రస్తుతం ఉన్న కోర్టులను బలోపేతం చేస్తూ మౌలిక వసతులు, ఉద్యోగుల సంఖ్య పెంపు, ఇతర వసతులు, అదనపు నిధులను ప్రభుత్వం సమకూర్చాలన్నారు. న్యాయవ్యవస్థను పటిష్టపరిచే చర్యలకు పూనుకోవాలని హితవు పలికారు. సామాన్య ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలను రద్దు చేసే వరకు పోరాడాలని సమావేశంలో తీర్మానించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, ఐలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రమణారావు, ఎం.అప్పారావు, సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.సింహాచలం, రైతుసంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఎఐటియుసి నాయకులు చిక్కాల గోవిందరావు, పెన్షనర్ల సంఘం నాయకులు డి.పార్వతీశం, కె.సూరయ్య, బిసి సంఘం నాయకులు బి.చంద్రపతిరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️