ఇపిఎస్‌ పెన్షనర్లకు అన్యాయం

ఇపిఎస్‌ పెన్షనర్లకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం

మాట్లాడుతున్న వి.జి.కె మూర్తి

  • కనీస పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలి
  • ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌పర్సన్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు వి.జి.కె మూర్తి
  • కలెక్టరేట్‌ వద్ద పెన్షనర్ల రిలే నిరాహార దీక్ష

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఇపిఎస్‌ పెన్షనర్లకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌పర్సన్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు వి.జి.కె మూర్తి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పార్వతీశం, ఎం.ఆదినారాయణమూర్తి విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ సమీపాన జ్యోతిరావుపూలే పార్కు వద్ద ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఐదు రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షలను సోమవారం వి.జి.కె మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ పెన్షన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇపిఎస్‌ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది ఇపిఎస్‌ పెన్షనర్లలో 80 శాతం మందికి నెలకు కనీస పెన్షన్‌ రూ.రెండు వేలకు మించి రావడం లేదని, వీరిలో సగం మంది పెన్షన్‌ రూ.వెయ్యి లోపు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరాసరి పెన్షన్‌ రూ.1482 మాత్రమే వస్తోందని, పెన్షనర్లకు కరువుభత్యం ఇవ్వడం లేదని విమర్శించారు. పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా వారి పెన్షన్‌ నిజ విలువ క్రమంగా తగ్గుతోందని, దీనివల్ల జీవిత చరమాంకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కనీస పెన్షన్‌ రూ.మూడు వేలు, కరువు భత్యం ఇస్తామని బిజెపి హామీనిచ్చిందని గుర్తుచేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా ఆ హామీని అమలు చేయలేదన్నారు. పెన్షన్‌ పెంపుదల కోసం నియమించిన కోషియర్‌ కమిటీ, హైపవర్‌ కమిటీ, పార్లమెంటరీ కమిటీలు పెన్షన్‌ పెంపునకు అనుకూలంగా సిఫార్సు చేశాయని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా పెన్షన్‌ పెంపునకు అనుకూల తీర్పు ఇచ్చిందని, బిజెపి ప్రభుత్వం మాత్రం నేటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇపిఎస్‌ పెన్షన్‌ కార్పస్‌ సుమారు రూ.7 లక్షల కోట్లు కాగా, దానిపై వడ్డీ సుమారు రూ.51 వేల కోట్లు వస్తోందని తెలిపారు. అందులో కేవలం 25 శాతం మాత్రమే పెన్షన్‌ చెల్లింపునకు వినియోగిస్తున్నారని చెప్పారు. ఏటా ఇదే పరిస్థితి ఉన్నా పెన్షన్‌ ఫండ్‌ పెరుగుతున్న చెల్లింపుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. 2014 ఆగస్టు తర్వాత ఉద్యోగం చేరిన వారికి సిపిఎస్‌ పరిధిలోకి వస్తారని, దీనివల్ల భవిష్యత్‌లో ఇపిఎస్‌ పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్ల సంఖ్య తగ్గుతుందన్నారు. కనీస పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు, కరువుభత్యం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌దారునికి భాగస్వామితో సహా వైద్యం ఉచితంగా అందించాలన్నారు. వృద్ధులకు గతంలో ఇచ్చిన రైల్వే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ లెక్కింపులో ప్రొరేటా పద్ధతిని రద్దు చేయాలన్నారు. పోస్టల్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు కె.వెంకటరావు, కార్యదర్శి కె.చంద్రశేఖరరావు సంఘీభావం తెలిపారు. నిరాహార దీక్షలో అసోసియేషన్‌ నాయకులు ఎల్‌.అనంతరావు, కె.వేణుగోపాలరావు, బి.వెంకటరావు, బి.ఎల్‌ రావు, జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️