ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వద్దు

ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌

మాట్లాడుతున్న మహమ్మద్‌ దివాన్‌ మైదీన్‌

  • లబ్ధిదారుని ఒప్పించి లక్ష్యం పూర్తి చేయాలి
  • గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దివాన్‌ మైదీన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దివాన్‌ మైదీన్‌ హెచ్చరించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో గృహ నిర్మాణాలపై అధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మిస్తున్న పేదలందరకీ ఇళ్లు పథకం గడువులోగా పూర్తి కావాల్సిందేనని చెప్పారు. రాష్ట్రంలో గృహనిర్మాణ ప్రగతిలో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానం నుంచి నాల్గవ స్థానం వచ్చిందని అన్నారు. పారదర్శకంగా సేవలు అందించడంలో గృహనిర్మాణ శాఖ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. మెగా హౌసింగ్‌ డ్రెవ్‌లో గృహాల నిర్మాణం పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సచివాలయం వారీగా ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు లక్ష్యం కేటాయించారని అన్నారు. లక్ష్యాలు పూర్తి చేసేందుకు మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, హౌసింగ్‌, విద్యుత్‌శాఖ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. నిర్మాణంలో జాప్యం జరగకుండా అవసరమైన సామగ్రిని ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అవసరమైన వసతులను కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల వేగవంతంపై అంతా దృష్టి సారించాలని చెప్పారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు సంబంధించిన బిల్లులను వెంటనే అప్లోడ్‌ చేయాలన్నారు. నిధులు సమస్య లేనందున బిల్లుల తక్షణ చెల్లింపులకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ మాట్లాడుతూ నిర్ధేశించిన లక్ష్యాల మేరకు ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్ధేశించిందన్నారు. అధికారులు మండల స్థాయిలో సమీక్షలు నిర్వహించి ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల లోటుపాట్ల వివరాలను తెలుసుకొని అదిగమించాలన్నారు. సచివాలయాల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లూ లబ్ధిదారుల ఆధ్వర్యాన ఇళ్ల నిర్మాణాలపై సమావేశాలు నిర్వహించి ప్రేరణ కల్పించాలన్నారు. లబ్ధిదారులకు నిర్మాణ దశలో ఉన్న పనులకు ఎంత మేర బిల్లుల చెల్లింపులు చేపట్టారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్‌.గణపతి, పలాస ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌, డ్వామా పీడీ చిట్టిరాజు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ వి.వి.ఎస్‌.ప్రసాద్‌, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌ నాగేశ్వరరావు, అర్బన్‌ సహాయ ఇంజినీర్‌ గణేష్‌ పాల్గొన్నారు.

 

➡️