ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు వేగవంతం

జిల్లాలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు త్వరితగతిన

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు, నోడల్‌ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలన్నారు. 4,500 రిజిస్ట్రేషన్‌ కాలేదని మూడు రోజుల్లో పూర్తి చేయాలని పలాస ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌ను ఆదేశించారు. అత్యధికంగా అర్బన్‌ మండలాల్లో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎంపిడిఒలతో సమన్వయం చేసుకొని తక్షణమే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో పెండింగ్‌లో ఉన్న ఫారం-6, 7, 8 పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడా లోపాలకు తావీయొద్దని సూచించారు.జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ మాట్లాడుతూ జిల్లాలో 27,600 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 2చ167 డాక్యుమెంట్లు సరిగా లేక రిజిస్ట్రేషన్లు తిరస్కరించినట్లు చెప్పారు. కోర్టు కేసులు ఉన్నవి పక్కన పెట్టి మిగిలినవి పూర్తి కావాలని ఆదేశించారు. రెవెన్యూ వెరిఫికేషన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రీ సర్వేను పూర్తి చేయాలన్నారు. రీ సర్వే మూడో దశకు సంబంధించి కొత్తగా రావాల్సిన, రివైజ్డ్‌ ప్రతిపాదనలు పంపాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, జెడ్‌పి సిఇఒ వెంకటేశ్వరరావు, డిసిఒ నగేష్‌, సిపిఒ లక్ష్మీప్రసన్న, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, ప్రకాశరావు, జిల్లా రిజిస్ట్రార్‌ కిల్లి మన్మథరావు, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

➡️