ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డగింత

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో

ఇసుక తవ్వకాలను అడుకున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- గార

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో వంశధార, నాగావళి నదుల్లో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతుందని, అధికారులు నియంత పాలన వైపే మొగ్గు చూపుతూ అక్రమ మైనింగ్‌ను అడ్డు కట్ట వేయకుండా చోద్యం చూస్తున్నారని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు, టిడిపి నాయకులు గొండు శంకర్‌ ఆరోపించారు. గార మండలం బూరవెల్లి వద్ద అక్రమంగా నడుపుతున్న ఇసుక ర్యాంప్‌ను గ్రామస్తులు, టిడిపి కార్యకర్తలతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలను తుంగలో తొక్కి, ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. మైన్స్‌ అధికారులు గత ఫిబ్రవరిలో 5,600 క్యూబిక్‌, 0.56 సెక్టార్లో అనుమతులు మంజూరు చేశారని అన్నారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా లక్షల క్యూబిక్‌ మీటర్లలో తవ్వకాలు జరుపుతూ రూ.కోట్ల విలువైన ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో యంత్రాలతో తవ్వకూడదన్న నిబంధన పట్టించుకోకుండా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నా పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. దీంతో యంత్రాలను అడ్డుకున్నామని చెప్పారు వంశధార నది పరివాహక ప్రాంతంలోని బూరవల్లి, అంబళ్లవానిపేట, సాలిహుండం పూసర్లపాడు, కొంక్యానపేట గ్రామాల్లో నలభై బోర్లకు నీరు అందకుండాపోయిందని అన్నారు. భూగర్భ జలాలు రానురానూ పాతాళానికి చేరుతున్నాయని పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలపై మైన్స్‌, రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగానికి ఫిర్యాదులు ఇచ్చినా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్‌ వచ్చినా తనిఖీలు చేయకుండా మౌనం వహించడంపై అభ్యంతర వ్యక్తం చేశారు. ఇసుక ర్యాంపు తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట గార మాజీ ఎంపిపి గుండ భాస్కరరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, శాలిహుండం సర్పంచ్‌ కొంక్యాన ఆదినారాయణ, తూలుగు మాజీ సర్పంచ్‌ కొయ్యాన జగదీష్‌, రెడ్డి శంకర్‌ పాల్గొన్నారు.

 

➡️