ఈసారైనా కరుణించేనా?

ఈసారైనా కరుణించేనా?
  • నేడు లోక్‌సభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
  • రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్లపై ప్రకటనపై ఎదురుచూపులు
  • వేతనజీవులకు ఊరట లభించేనా?
  • పెట్టుబడి సాయం పెంపుపై అన్నదాతల ఆశలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న ఎన్నికల బడ్జెట్‌పై జిల్లా ప్రజలు గంపెడాశలతో ఉన్నారు. గతేడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పూర్తి రిక్తహస్తమే చూపింది. ఈసారైనా వెనుకబడిన జిల్లాకు ఏమేరకు ప్రాధాన్యం లభిస్తుందోనని జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ఈసారి ప్రజలకు వరాలు ప్రకటిస్తారా? లేక పన్నులు పెంచి సబ్సిడీలు కుదించి వాతలు పెడతారా అని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు.నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించే చర్యలు ఏమైనా ఉంటాయా అనే చర్చ జనంలో సాగుతోంది.ప్రధానంగా ఆదాయ పన్ను పరిమితి పెంపుపై వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్‌లోనైనా జిల్లాకు రైల్వే ప్రాజెక్టులు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరాలు కోసం జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించే రాయితీలపై రైతాంగం ఎదురుచూస్తోంది. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి, మినప, పెసలు తదితర ప్రధాన పంటలను సాగు చేస్తున్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం 2023 ఖరీప్‌లో కంటితుడుపుగానే మద్దతు ధరలను ప్రకటించింది. విత్తనాలు, ఎరువులపై అందిస్తున్న సబ్సిడీలను కుదించింది. మరోవైపు పెరరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వ్యవసాయ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ, బ్యాంకుల నుంచి రుణాల పంపిణీ వంటిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో అని అన్నదాతలు చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వస్తే స్వామినాధన్‌ కమిషన్‌ అమలు చేస్తామని 2014లోనే బిజెపి ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు అమలు కాలేదు. మద్దతు ధరలకు గ్యారంటీ చట్టం చేయాలని రైతులు చాలా కాలం నుంచి డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్‌లో ఏం నిర్ణయం వెల్లడించనుందో అన్నదాతలు ఆశగా చూస్తున్నారు. చివరి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనైనా ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో ఎడాది రూ. 6 వేల సాయాన్ని మూడు విడతలుగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల వరంగా రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధిని మొత్తాన్ని ప్రభుత్వం పెంచనుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పెట్టుబడి సాయంపై రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.రైళ్లు, రైల్వే ప్రాజెక్టులపై ఏం నిర్ణయాలో..శ్రీకాకుళం రోడ్డును మోడల్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దనున్నట్లు గతంలో హామీనిచ్చినా అంతంతమాత్రంగానే అమలవుతోంది. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్‌ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేస్తామని 2012-13 రైల్వే బడ్జెట్‌లో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. జిల్లాలోని జి.సిగడాం నుంచి రాజాం మీదుగా విజయనగరం జిల్లా బొబ్బిలిని కలుపుతూ గతంలో రూ.60 లక్షలతో సర్వే చేశారు. ఇప్పటివరకు దానికి అతీగతి లేదు. ఈ స్టేషన్‌ మీదుగా వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ – హౌరా, పూరీ – అహ్మదాబాద్‌ రైళ్లు ఆగకుండా వెళ్లిపోతున్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో సుమారు 12కు పైగా ఎక్స్‌ప్రెస్‌లు ఆగకుండా వెళ్లిపోతున్నాయి. ప్రతి వారం ఐదారు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ స్టేషన్‌ మీదుగా ప్రయాణిస్తున్నా, హాల్టింగ్‌ లేదు. కాశీకి, షిర్డీకి నేరుగా ప్రత్యేక రైలు కావాలన్నది జిల్లా ప్రజలు చాలాకాలం నుంచి కోరుతున్నా, అదీ కలగానే మిగిలింది. రాజాం రైల్వే లైన్‌ హామీ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. విశాఖ-హడ్డుబంగి ప్రాంతానికి కొత్త రైలు మార్గం వేయనున్నట్లు ప్రకటించినా, దానిలోనూ కదలిక లేదు. రైళ్లకు హాల్ట్‌లు, జిల్లా మీదుగా వెళ్లే కొత్త రైళ్లపై జనం ఆశలు పెట్టుకున్న ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లుతుందా?, నెరవేరుస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.బడ్జెట్‌పై వేతన జీవుల ఆశలువేతన జీవులకు ఎంత కాలంగా పన్నుల విషయంలో కావాల్సినంత ఊరట లభించడం లేదు. దీంతో ప్రస్తుత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పన్నుల విషయంలో గతేడాది బడ్జెట్‌లోనూ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షలకు పెంచినట్టే పెంచిన కేంద్ర ప్రభుత్వం, వారికి కల్పిస్తున్న కొన్ని సౌకర్యాలపై కోత పెట్టింది. పాత విధానంలో ఉన్న హెచ్‌ఆర్‌ఎ, సిపిఎస్‌, 80సి, 80డి, ఇళ్ల రుణాలపై అందిస్తున్న మినహాయింపులను ఆపేసింది. ఈ బడ్జెట్‌లోనైనా ఆదాయపు పన్ను పరిమితిని కొంతమేర అయినా కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు.’ఉపాధి’ కి కేటాయింపులు పెరిగేనా? వ్యవసాయ సీజన్‌ ముగిసిన తర్వాత గ్రామాల్లో ప్రత్యామ్నాయ పనులకు ఉపాధి హామీ ఉంది. జిల్లాలో 2023-24లో 4.28 లక్షల జాబ్‌కార్డులు జారీ చేయగా 6.07 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 4.86 లక్షల మంది కూలీలు పనులకు వచ్చారు. 2023-24 బడ్జెట్‌లో రూ.60 వేల కోట్లు కేటాయించారు. ఈసారి ఉపాధి హామీ చట్టానికి నిధుల కేటాయింపులు పెరిగితే వీలైనంత ఎక్కువ మందికి పనులు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

➡️