‘ఉపాధి’కి కోత

నిరుపేదలకు ఆసరాగా నిలుస్తున్న

సంతబొమ్మాళి : ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

  • ఆధార్‌ బేస్డ్‌ పేమెంట్‌ అమలుకు కేంద్రం శ్రీకారం
  • ఆధార్‌ అనుసంధానంలో సాంకేతిక ఇబ్బందులు
  • జిల్లాలో 7.38 లక్షలకు గానూ 6.12 లక్షల మంది వివరాలే నమోదు
  • 1.26 లక్షల మంది ఉపాధికి దూరం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధిని

రుపేదలకు ఆసరాగా నిలుస్తున్న ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం పలురూపాల్లో తూట్లు పొడుస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ఉపాధి కుదింపు చర్యలు మొదలుపెట్టింది. ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఉపాధి హామీకి ఆధార్‌ బేస్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను ఈనెల ఒకటో తేదీ నుంచి అమలు చేసేందుకు సిద్ధమైంది. నేషనల్‌ పేమెంట్‌ ఇండియా లిమిటెడ్‌ ద్వారా కూలీలకు వారి ఖాతాల్లో డబ్బులు వేసేందుకు గతేడాది కాలంగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ప్రభుత్వం అనుకున్న పని నెరవేరడంతో అమలుకు సిద్ధమైంది. దీంతో జిల్లాలో లక్ష మందికి పైగా కూలీలు ఉపాధి కోల్పోనున్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసే విధానాలను అవలంభిస్తూ వస్తోంది. తొలుత యాక్టివ్‌ వర్కర్లతో పేరుతో కుదింపు చర్యలు మొదలుపెట్టింది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మంది వరకు జాబ్‌కార్డులను జారీ చేశారు. తర్వాత వీరిలో చురుగ్గా పనిచేసే కూలీల సంఖ్యను విడగొట్టి కొత్త జాబితాను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పనుల్లేక వలసలు వెళ్లిన కూలీలు, వేర్వేరు పనుల్లోకి వెళ్లిన కూలీలను తొలగించి యాక్టివ్‌ వర్కర్స్‌ పేరుతో కొత్త జాబితాను రూపొందించింది. ఆవిధంగా జిల్లాలో పది లక్షల మంది ఉన్న కూలీల సంఖ్యను 7.38 లక్షలకు కుదించారు. 2020-21 వరకు ఉపాధి హామీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం టిసిఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌) టెక్నాలజీని వినియోగించేది. దేశవ్యాప్తంగా ఒకటే విధానం ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 2021-22 నుంచి ఎపిని కూడా ఎన్‌ఐసి (నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) పరిధిలోకి తీసుకొచ్చింది. ఆ క్రమంలో కూలీలు కొన్ని సౌకర్యాలను కోల్పోయారు. ఫిబ్రవరిలో అదనంగా 20 శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్‌, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం చొప్పున చెల్లించేవారు. ఎండలతో భూమి గట్టిపడడం, వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతల్లో పనిచేయడం కష్టంగా ఉంటుందని వేసవిభత్యం కింద అదనంగా చెల్లించేవారు. 2021-22 నుంచి దాన్నీ ఆపేశారు. కూలీలకు గతంలో మజ్జిగ కోసం రోజుకు రూ.5 చొప్పున అదనంగా చెల్లించేవారు. రెండేళ్లుగా దాన్నీ ఆపేశారు. సాధారణ రోజుల్లో తాగునీటి కోసం రూ.5 చొప్పున చెల్లించే విధానాన్నీ నిలిపేశారు.ఉపాధికి 1.26 లక్షల మంది దూరంరాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూలీలకు తానే డబ్బులు చెల్లిస్తూ వస్తోంది. ఇకపై చెల్లింపులన్నీ తానే చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చెల్లింపు బాధ్యతలను నేషనల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పిసిఐఎల్‌)కు అప్పగించింది. వారు కూలీలకు సంబంధించిన వివరాలతో పాటు బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబర్లను సేకరించారు. ఈ ప్రక్రియలో ఆధార్‌ నంబరుకు, ఎన్‌పిసిఎల్‌కు లింకు కుదరలేదు. దీంతో బ్యాంకు ఖాతాతో ఉన్న ఆధార్‌ నంబరును ఒకసారి తొలగించి, కొత్తగా లింక్‌ చేయించాలని అధికారులకు సూచించింది. ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆ పని చేయించినా చాలాచోట్ల కుదరలేదు. లింక్‌ కాని వారితో పోస్టల్‌ ఖాతాలనూ తెరిచారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో విడిచిపెట్టేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే జిల్లాలో 7.38 లక్షల మంది కూలీలు ఉండగా 6.12 లక్షల మంది కూలీల వివరాలు మాత్రమే లింక్‌ అయ్యాయి. వీరిలో ఆధార్‌ లింక్‌ కాని వారు, వలసలు వెళ్లిన వారి వివరాలు అనుసంధానం కాలేదు. ఆధార్‌ అనుసంధనం లేకపోవడంతో వీరంతా ఉపాధి పనులకు దూరంగా కానున్నారు. అధికారులు వాస్తవాలను దాచి 6.12 లక్షల మంది వివరాలనే పరిగణనలోకి తీసుకున్నారు. అప్‌డేట్‌ అవుతున్న 216ను మినహాయించి 99 శాతానికి పైగా అనుసంధానం పూర్తయినట్లు లెక్కలు చెప్తున్నారు.చెల్లింపులే అసలు సమస్యఇప్పటివరకు కొత్త విధానం ద్వారా కూలీలకు ఇంకా చెల్లింపులు ప్రక్రియ మొదలు కాలేదు. డబ్బులు ఖాతాలో వేస్తే ఎంతమందికి జమ అయ్యాయో, ఎంతమందికి కాలేదో తెలుస్తోంది. జిల్లాలో ఉపాధి హామీ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. జిల్లాలో 910 పంచాయతీలు ఉండగా 678 పంచాయతీల్లో పనులు మొదలయ్యాయి. ఉపాధి పనులకు ప్రస్తుతం 39,992 మంది కూలీలు వస్తున్నారు.

 

➡️