‘ఉపాధి’ కూలీలకు రూ.600 ఇవ్వాలి

మహిళా సాధికారతను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, మహిళల కోసం తయారు చేసిన చట్టాలను సైతం

ఆందోళన చేస్తున్న ఉపాధి కూలీలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మహిళా సాధికారతను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, మహిళల కోసం తయారు చేసిన చట్టాలను సైతం అమలు చేయకుండా, రక్షణ లేకుండా చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గంగరాపు ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గార మండలం సతివాడలో పనిచేస్తున్న ఉపాధి కూలీలతో శుక్రవారం మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళల హక్కుల కోసం చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారత అంటూ ఉపన్యాసాలు చెప్పి గద్దె నెక్కిన పాలకులు అధికారంలోకి రాగానే ఆ మాటను విస్మరిస్తున్నారన్నారు. పోరాడి సాధించు కున్న ఉపాధి చట్టానికి తూట్లు పొడుస్తూ మహిళా కూలీలకు కనీస కూలి అందకుండా చేస్తున్నారన్నారు. గ్రామీణ పేదరికం పెరుగుతోందని, పెరుగుతున్న ధరల ప్రభావంతో చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలతో బతుకు భారమవు తోందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా కుటుంబాలను ఆదుకునేందుకు ఉపాధి కూలీలకు పూర్తిస్థాయిలో పని కల్పించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నా… రాష్ట్రంలో సిఎం జగన్మోహనరెడ్డి ప్రశ్నించడం లేదన్నారు. సమావేశంలో సిర్ల మంగమ్మ, పెయ్యల రాజేశ్వరి, కర్రి రాములమ్మ, సింహాద్రి, కుమారి పాల్గొన్నారు.

 

➡️