ఎండల తీవ్రత దృష్ట్యా అప్రమత్తం

వేసవి వేడి గాలుల తీవ్రత పెరిగే

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలి
  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం

వేసవి వేడి గాలుల తీవ్రత పెరిగే సూచనల దృష్ట్యా విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని, అన్ని మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌లను తెరవాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రాబోయే వడ గాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణపై జిల్లా అధికారులతో కలసి తహశీల్దార్లు, ఎంపిడిఒలతో కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ గాలుల కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ మృతి చెందకుండా చూడటమే లక్ష్యమని అన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటికే పలు సూచనలు చేశామని, వాటిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నీటి టాంకర్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో, బస్టాండ్‌ల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యుత్‌ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అగ్నిమాపకశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉపాధి పని ప్రదేశాల్లో కూలీలకు కనీస అవసరాలు సమకూర్చాలన్నారు. ప్రాథమిక చికిత్స కిట్లు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్స్‌ అందుబాటులో ఉంచాలన్నారు. వీటికి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ప్యాకెట్ల సరఫరా చేయాలన్నారు. మండలాల్లో క్యాంపులు నిర్వహించి పశువులకు మేత, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఎండ తీవ్రత అధికంగా ఉన్న రోజుల్లో ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని సూచించారు. ఆర్‌టిసి అధికారులు తమ సిబ్బందికి జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. ఈత పేరుతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు వేసవి కాలంలో నిర్వహించాల్సిన బాధ్యతలను గురించి విద్యాశాఖ అధికారులు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. సమావేశం డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ప్రకృతి విపత్తుల సంస్థ నుంచి పి.రాము, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌కుమార్‌, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.శ్రీధర్‌, సిపిఒ ప్రసన్నలక్ష్మి, గ్రామ సచివాలయాల నోడల్‌ అధికారి వాసుదేవరావు, జిల్లా ట్రాన్స్‌ఫోర్టు అధికారి ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి మోహనరావు, అర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ శ్రీనివాసరావు, పశు సంవర్థక శాఖ జెడి కిషోర్‌ పాల్గొన్నారు.

➡️