ఎంపీల సస్పెన్షన్‌ సిగ్గుచేటు

పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన 146 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు అని 'ఇండియా' వేదిక నాయకులు అన్నారు. మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్యలు, ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ 'ఇండియా' వేదిక దేశవ్యాప్త

శ్రీకాకుళం అర్బన్‌ : ధర్నా చేస్తున్న ఇండియా వేదిక నాయకులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన 146 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు అని ‘ఇండియా’ వేదిక నాయకులు అన్నారు. మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్యలు, ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ‘ఇండియా’ వేదిక దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా నగరంలోని అంబేద్కర్‌ కూడలి వద్ద శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సనపల అన్నాజీరావు మాట్లాడుతూ పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని విమర్శించారు. బిజెపి ఎంపీ ఇచ్చిన సిఫారసు లేఖ ద్వారా ఈనెల 13న లోక్‌సభ గ్యాలరీలోకి అగంతకులు సందర్శకులుగా ప్రవేశించి, పొగబాంబులు వదిలి అలజడి రేపారని గుర్తుచేశారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని సదరు ఎంపీలు డిమాండ్‌ చేయడమే నేరంగా పరిగణించిన మోడీ సర్కార్‌ పార్లమెంట్‌ ఉభయ సభల నుంచి 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసిందని ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానానికి ఇది పరాకాష్ట అని అన్నారు. పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు నోరు ఎత్తడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్తున్న టిడిపి, దేశ చట్ట సభల్లో మోడీ నిరంకుశత్వంపై ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. వైసిపి, టిడిపి పార్లమెంట్లో బిజెపికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని వారన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీల వైఖరి మార్చుకొని బిజెపి నిరంకుశత్వంను వ్యతిరేకించాలని కోరారు. ధర్నాలో సిపిఎం నాయకులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, జి.సింహాచలం, పి.తేజేశ్వరరావు, కె.అప్పారావు, ఎం.గోపి, కాంగ్రెస్‌ నాయకులు పి.నాగభూషణం, డి.గోవింద్‌, పి.శాంతికుమారి, ఎ.రామనర్సు తదితరులు పాల్గొన్నారు. పలాస : కాశీబుగ్గలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఇండియా వేదిక నాయకులు ధర్నా చేపట్టారు. పార్లమెంటులో దుండగులు చొరబడిన ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దువ్వాడ జీవితేశ్వరరావు, సిపిఐ నాయకులు చాపర వెంకటరమణ, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమాక్రసీ నాయకులు తామాడ సన్యాసిరావు, మద్దిల వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️