ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు

Mar 13,2024 21:27

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌ : సార్వత్రిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌ తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్‌పిలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా బుధవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌, ఎస్‌పి జి.ఆర్‌.రాధిక, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హింసకు తావు లేకుండా, రీపోలింగ్‌ జరిగే అవకాశం ఇవ్వకుండా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖేష్‌ కుమార్‌ మీనా.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలకు సూచించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ మనజీర్‌ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయనకు నివేదించారు. ఎన్నికల నిర్వహణకు మానవ వనరులు, సామగ్రి, సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి మ్యాపింగ్‌, సి విజిల్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమ్యూనికేషన్‌ ప్లాన్‌, తదితర అంశాలలో సర్వ సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి అన్ని రకాల దరఖాస్తులు 2956 పరిష్కరించాల్సి ఉందన్నారు. గత వారం రోజుల్లోనే 1845 కొత్త దరఖాస్తులు వచ్చాయన్నారు. కొత్తగా 2,82,688 ఓటరు కార్డులకు గాను 2.55 లక్షలు కార్డులు చేరుకున్నాయని తెలిపారు. వీటిలో 1,91,978 కార్డులను పోస్టల్‌ శాఖ ద్వారా డిస్పాచ్‌ చేశామన్నారు. రానున్న మూడు రోజుల్లో వంద శాతం పంపిణీ చేయడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎఎస్‌పి ప్రేమ కాజల్‌, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, ఆర్‌డిఒలు సిహెచ్‌.రంగయ్య, భరత్‌ నాయక్‌, డ్వామా పీడీ చిట్టి రాజు, పలువురు నోడల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️