ఎన్నికల కోడ్‌ ఉన్నా.. జగనన్న స్టిక్కర్లే

మండలంలోని వంశధార నదీ పరివాహక ప్రాంతమైన

లారీలను ఇసుకతో లోడ్‌ చేస్తు న్న ప్రొక్లెయిన్‌

ఆగని ఇసుక తవ్వకాలు

అధికారుల పర్యవేక్షణ కరువు

ప్రజాశక్తి- ఆమదాలవలస

మండలంలోని వంశధార నదీ పరివాహక ప్రాంతమైన చవ్వాకులపేట వద్ద జరుగుతున్న ఇసుక తవ్వకాలకు హద్దూ, అదుపు లేదు. ఇష్టానుసారం తోడేసి తరలించకపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా ఇసుక ర్యాంపు నుంచి రోజూ విశాఖపట్నానికి వందల సంఖ్యలో భారీ వాహనాలు ఇసుక రవాణా చేయడంపై గ్రామీణ రహదారులు అధ్వానస్థితికి చేరుకోవడంతో పలు గ్రామాల ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా రవాణా అవుతుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా జిల్లా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నది నుంచి ఇసుకను వేరే ప్రాంతంలో ఇసుక డిపో కేంద్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇసుక రవాణా చేసి విక్రయాలు జరపాలన్న నిబంధనలు ఉంది. అటువంటి నిబంధనలను బుట్టదాఖలు చేసి రాత్రి వేళలో కూడా నేరుగా వంశధార నదిలోనికి భారీ వాహనాలను తీసుకువెళ్లి యంత్రాలతో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరిపి తరలించుకుపోతున్నారు. జిల్లా, మండల అధికారులు ఏ ఒక్కరూ కనీస పర్యవేక్షణ చేయకపోవడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిబంధనలు ఉన్నా ఇసుక తరలిస్తున్న వాహనాలపై సిఎం జగన్మోహన్‌రెడ్డి స్టిక్కర్లను వాహనాల అద్దాలపై అతికించి యథేచ్ఛగా ఇసుక రవాణా జరుపుతున్నారు. అంతేకాకుండా ఇసుక లోడింగ్‌ ప్రాంతం నుంచి వాహనాలపై పరదాలు మూసివేసి రవాణా చేయాలన్న ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు వాటిని పాటించకుండా ఇసుకను తరలిస్తున్నారు. ప్రధాన రహదారులపై లారీలు వెళ్తున్న సమయంలో ఇసుక లారీ వెనుక వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల పరిధిలో చవ్వాకులపేట ఉండగా నదికి అవతల వైపు నరసన్నపేట మండలం నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది. అయితే ప్రతిమ ఏజెన్సీ ద్వారా ఇసుక తవ్వకాలు జరుపుతున్న సంస్థ మండలాలే కాకుండా జిల్లాల సరిహద్దులను దాటి నదిని గుల్ల చేసినప్పటికీ చర్యలు తీసుకునే అధికారులు కరువయ్యారు. తమకు ఎదురులేరన్న ధీమాతో భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక తరలిస్తున్న ప్రాంతంలో బరువు, పరిమాణం నిర్ధారించి అనుమతి పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాంతంలో బరువు నిర్ధారించే యంత్రం కూడా మరమ్మతులకు గురైంది. దీంతో ఎటువంటి బరువు నిర్ధారణ లేకుండానే అధిక బరువులతో ఇసుక లారీలు గ్రామీణ రహదారులపై ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల బిటి రోడ్డు సాధారణ గ్రావెల్‌ రోడ్డుగా మారిపోయా యి. దీనిపై పరిసర గ్రామస్తులు పలుమార్లు ఇసుక లారీలను అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. లారీలను అడ్డుకున్న సమయంలో ఆమదాలవలస పోలీసులు ప్రత్యక్షమై ఇసుక తవ్వక నిర్వాహకులకు, గ్రామస్తులకు సర్ధిచెప్పి మరోసారి ఇటువంటి తప్పులు జరగవని ర్యాంపు నిర్వాహకులతో గ్రామస్తులకు చెప్పిస్తున్నారు. మళ్లీ మరుసటి రోజు నుంచి యథావిధిగా ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాలు జరుపుకోవడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా మారిందని వాపోతున్నారు.

 

 

➡️