ఎసిబికి చిక్కిన జిఎస్‌టిఒ కిషోర్‌

కాశీబుగ్గలోని రాష్ట్ర పన్నుల శాఖ

పట్టుబడిన నగదుతో జిఎస్‌టిఒ కిషోర్‌ కుమార్‌

  • రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

ప్రజాశక్తి – పలాస

కాశీబుగ్గలోని రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో జిఎస్‌టిఒగా పనిచేస్తున్న ఎన్‌.కిషోర్‌ కుమార్‌ అవినీతి నిరోధక శాఖకు బుధవారం చిక్కారు. జిఎస్‌టి రిటర్న్స్‌ ఇచ్చేందుకు గానూ రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఎసిబి శ్రీకాకుళం డిఎస్‌పి బి.వి.ఎస్‌ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం… కిషోర్‌ కుమార్‌ రెండేళ్లుగా పలాసలో జిఎస్‌టిఒగా పనిచేస్తున్నారు. పలాసకు చెందిన జీడి వ్యాపారి తన వ్యాపారానికి సంబంధించి జిఎస్‌టి పన్నులు చెల్లించారు. ఇందుకు సంబంధించి ఆయనకు రూ.14 లక్షల జిఎస్‌టి రిటర్న్స్‌ రావాల్సి ఉంది. ఆ మొత్తం కోసం కాశీబుగ్గలోని రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో జిఎస్‌టిఒ కిషోర్‌ కుమార్‌ను సంప్రదించారు. ‘మీకేం డబ్బులు రావని, తిరిగి మీరే ఇంకా చెల్లించాల్సి ఉంటుందేమో చూడాలి’ అని అన్నారు. తాను చెల్లించాల్సిన పన్నులన్నీ సక్రమంగా చెల్లించానని, తనకు రిటర్న్స్‌ వస్తాయని పరిశీలించాలని వ్యాపారి కోరారు. తనకు రూ.1.50 లక్షల లంచం ఇస్తే, రిటర్న్స్‌ మొత్తం వచ్చేలా చేస్తానని కిషోర్‌ కుమార్‌ చెప్పారు. చివరకు రూ.లక్ష ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. జిఎస్‌టిఒ తీరుతో విసిగిన వ్యాపారి ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ప్రణాళిక ప్రకారం వ్యాపారి పన్నుల శాఖ కార్యాలయంలో జిఎస్‌టిఒకు రూ.లక్ష లంచం ఇస్తుండగా, అక్కడే మాటు వేసి ఉన్న ఎసిబి అధికారులు దాడి చేశారు. నగదును స్వాధీనం చేసుకున్న అనంతరం కార్యాలయంలోని ఫైళ్లను పరిశీఇంచారు. జిఎస్‌టిఒను అరెస్టు చేసి, విశాఖపట్నంలోని ఎసిబి కోర్టుకు గురువారం తరలించనున్నట్లు తెలిపారు. దాడిలో ఎసిబి సిఐ ఎన్‌.వి.రమణ, ఎస్‌ఐలు సత్యారావు, చిన్నంనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️