ఎస్మాకు భయపడేది లేదు

ప్రభుత్వం ఉపయోగించిన ఎస్మాకు అంగన్వాడీలు భయపడేదిలేదని, అంగన్వాడీ కోర్కెలు న్యాయసమ్మతమైనవని

కొత్తూరు : పొర్లుదండాలు పెడుతున్న అంగన్వాడీలు

ప్రజాశక్తి- జిల్లా విలేకరుల యంత్రాంగం

ప్రభుత్వం ఉపయోగించిన ఎస్మాకు అంగన్వాడీలు భయపడేదిలేదని, అంగన్వాడీ కోర్కెలు న్యాయసమ్మతమైనవని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి అన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద జ్యోతిభాపూలే పార్కు సమీపాన ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యాన చేపట్టిన 24 గంటలు నిరాహార దీక్షలు బుధవారానికి ఐదో రోజుకు చేరాయి. ముందు శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అంగన్వాడీలు 30 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండివైఖరి వీడకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీల సంక్షేమానికి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పైగా అంగన్వాడీలపై బెదిరింపులు, నోటీసులు ఇవ్వడం మానుకొని తక్షణమే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రాధాన్యత ఉన్న ఐసిడిఎస్‌ సంస్థకు నిధులు పెంచి అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్బంధాలకు, అరెస్టులకు, కేసులకు అంగన్వాడీలు భయపడే వారు కాదని, ఇటువంటి ప్రభుత్వాలను అనేకం చూశారని వివరించారు. ఆమరణ దీక్షకైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. సిఎం జగన్‌ ఇచ్చిన హామీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. గర్భిణులకు, బాలింతలకు, పిల్లలు అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ దీక్షకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.చందు, బి.హరీష్‌, ఎ.సంతు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ దీక్షలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుదర్శనం, బి.ఆదిలక్ష్మి, టి.రాజేశ్వరి, ఇ.అప్పలనరసమ్మ, కె.నాగపద్మ, వై.లీలారత్నం, ఎన్‌.కృష్ణభారతి, పి.భారతి, సిహెచ్‌.అరుణ, చిట్టితల్లి పాల్గొన్నారు.కొత్తూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు కె.లక్ష్మి, హేమలత, జలజాక్షి, ధనలక్ష్మి, లక్ష్మి, అమ్మాయమ్మ, బోడెమ్మ, అరుణ, భవాని, మధురవేణి, నిర్మల, జ్యోతి, ఉత్తర రమణమ్మ, లక్ష్మి, సిఐటియు నాయకులు సిర్ల ప్రసాద్‌, నిమ్మక అప్పన్న పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. ఇచ్ఛాపురం బస్టాండ్‌ చేపట్టిన సమ్మెలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేతులు ఎత్తి మొక్కుతూ నిరసన తెలిపారు. కోటబొమ్మాళి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మెలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, సిఐటియు నాయకులు దుంపల సుదర్శన్‌ పాల్గొన్నారు. పొందూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెలో యూనియన్‌ నాయకులు జ్యోతిలక్ష్మి, నాగరత్నం, రమణమ్మ, కృష్ణవేణి పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. పలాస-కాశీబుగ్గ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద చేపట్టిన సమ్మెలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మంజుల, బి.సునీత, కె.జ్యోతి, బి.చామంతి, బి.నిర్మల, జయలక్ష్మి, నారాయణి, ఆర్‌.భవాని పాల్గొన్నారు. మందస ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద చేపట్టిన సమ్మెలో సిఐటియు నాయకులు దిలీప్‌కుమార్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎన్‌.హైమావతి, జాన్సీ, కె.ప్రభావతి, పద్మ, ఎస్‌.గీత, వి.హేమలత పాల్గొన్నారు. ఆమదాలవలస ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పంచాది లతాదేవి, పి.భూలక్ష్మి, మొదలవలస లత, పి.లక్ష్మి, మాధవి, కనకం పాల్గొన్నారు.టెక్కలి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు నాయకులు నంబూరు షణ్ముఖరావు, రమణమ్మ, సుజాత, పద్మావతి, రమా, ఇందిర, అరుణ, ఉష పాల్గొన్నారు.

 

➡️