ఎస్మా చట్టం… భష్మాసుర హస్తం

అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం

రాస్తారోకో చేస్తున్న కార్మిక, ప్రజాసంఘాల నాయకులు

  • జిఒ నంబరు 2ను రద్దు చేయాలి
  • కార్మిక, ప్రజాసంఘాల జైల్‌భరో

* 11 మంది నాయకులు అరెస్టు, విడుదల

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై కార్మిక, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంగన్వాడీలు, మున్సిపల్‌, సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా మంగళవారం జైల్‌భరో కార్యక్రమం చేపట్టాయి. కలెక్టరేట్‌ సమీపాన పొన్నాడ వంతెన వద్ద రాస్తారోకో చేపట్టగా సిఐటియు సీనియర్‌ నాయకులు భవిరి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు కె.నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలంతో పాటు 11 మందిని అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా చట్టం వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి భష్మాసుర హస్తం కానుందని కార్మిక, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. అరెస్టులకు ముందు వారు మాట్లాడుతూ అంగన్వాడీలను ఎస్మా చట్ట పరిధిలోకి తీసుకొచ్చి సమ్మెను నిషేదించడం అప్రజాస్వామికమన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యలతో విచ్ఛిన్నం చేయాలనుకోవడం నియంతృత్వమని ధ్వజమెత్తారు. సమ్మె కార్మికుల హక్కు అని, చట్ట ప్రకారం 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెకు వెళ్తామన్నారు. నాలుగేళ్లుగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు సమ్మెకు దిగారని తెలిపారు. నోటీసులు ఇవ్వడం, ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం, నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. అంగన్వాడీ అక్కచెల్లెమ్మలపై ప్రేమ ఉందని చెప్పే ముఖ్యమంత్రి వారిని రోడ్డున పడేయడం సిగ్గుచేటు అన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానికి నిరంకుశ వైఖరి కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలపై బెదిరింపులు వెంటనే ఆపాలని, చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలన్నారు. అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర, కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆదినారాయణ మూర్తి, ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️