ఏం జరగబోతోంది?

రాబోవు ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చనున్నారన్న ఊహగానాలు

ఎచ్చెర్ల వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ‘బెల్లాన’!

వైసిపి అధిష్టానం ప్రతిపాదన

షాక్‌కు గురైన చిన్న శ్రీను మద్దతుదారులు

వ్యతిరేకిస్తున్న కిరణ్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలు

జిల్లాకు సంబంధించి తొలుత ఎచ్చెర్ల మార్పుపై అధిష్టానం వద్ద చర్చ జరిగిన నేపథ్యంలో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే పడింది. ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను మార్చి ఆ స్థానంలో విజయనగరం జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావును నియమిస్తారంటూ ఇప్పటివరకు ప్రచారం జరిగింది. అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుందోనని ఇప్పటివరకు అంతా ఎదురు చూశారు. వైసిపి అధిష్టానం అకస్మాత్తుగా ఈ నెల ఎనిమిదో తేదీన విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జి నియమించనుందన్న వార్తతో మజ్జి శ్రీను మద్దతుదారులు అంతా కంగుతిన్నారు. అధిష్టానం నిర్ణయంపై అటు ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలు రెండూ షాక్‌కు గురయ్యాయి.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

రాబోవు ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చనున్నారన్న ఊహగానాలు నిజం చేసేలా వైసిపి అధిష్టానం ఈ నెల ఎనిమిదో తేదీన ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ వ్యతిరేకవర్గం భగ్గుమంది. పార్టీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గొర్లె అనుకూలవర్గం పార్టీ పెద్దలను కలిసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. జి.సిగడాం మండలం వాండ్రంగిలో బుధవారం సమావేశమై మజ్జి శ్రీను, స్థానికంగా ఉన్న వారికి టిక్కెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ను వినిపించారు.సుముఖంగా లేని చిన్న శ్రీను ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా గత మూడేళ్లుగా మజ్జి శ్రీనును ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. గొర్లె కిరణ్‌కుమార్‌ ఎమ్మెల్యే మళ్లీ అభ్యర్థి అయితే ఎట్టి పరిస్థితుల్లో తాము పని చేయబోమని ఒకట్రెండు సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు. ఎచ్చెర్లకు మజ్జి శ్రీనుకే బాధ్యతలు అప్పగిస్తుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. పార్టీ మాత్రం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను నియమించడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎచ్చెర్లలో కొంత కేడర్‌ మజ్జి శ్రీనును కోరుకుంటున్నా అయన మాత్రం ఇక్కడి నుంచి పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోం ది. పార్టీలో నెలకొన్న అసమ్మతి, గ్రూపుల పోరు నడుమ పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తిగా చూపలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయనగరం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయినట్లు చర్చనడుస్తోంది. తగువు తీర్చడానికి వచ్చి …ఎచ్చెర్ల నియోజకవర్గ వైసిపిలో అసమ్మతి పోరు పార్టీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో అక్కడ పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ ఏడాది అక్టోబరులో ఎంపీ బెల్లానకు అధిష్టానం బాధ్యతలను అప్పగించింది. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను చీపురుపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయానికి మండలాల వారిగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నాయకులను పిలిచి మాట్లాటారు. ఎంపీ చంద్రశేఖర్‌ ఆహ్వానాన్ని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మినహా మిగిలిన అసమ్మతి నాయకులు తిరస్కరిం చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అసమ్మతి నాయకులంతా రాబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే కిరణ్‌కు టిక్కెట్‌ ఇస్తే పార్టీకి పనిచేయలేమని సైతం చెప్పేశారు. అదే సమయంలో ఎంపీ బెల్లాన ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కొంత మేర ప్రయత్నాలు జరిపారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు అవే నిజం కావడంతో తగవు తీర్చడానికి వచ్చి తిష్ట వేశారంటూ గొర్లె అనుకూలవర్గం ఆడిపోసుకుంటోంది.

➡️