ఐక్య పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలన్నీ ఐక్య పోరాటాలు

జ్ఞాపికను అందజేస్తున్న తేజేశ్వరరావు

  • సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలన్నీ ఐక్య పోరాటాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సీనియర్‌ నాయకులు భవిరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. సిఐటియు జాతీయ నాయకులు పర్సా సత్యనారాయణ శత జయంతోత్సవాల్లో భాగంగా సిఐటియు ఆధ్వర్యాన రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సెమినార్‌ సోమవారంతో ముగిసింది. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సెమినార్‌లో వారు మాట్లాడుతూ కార్మికులు, రైతులు, ప్రజలకు, దేశానికి వ్యతిరేకమైన వినాశకర కార్పొరేట్‌ అనుకూల విధానాలను బిజెపి ప్రభుత్వం దూకుడుగా అమలు చేస్తోందని విమర్శించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే వీటికి పరిష్కారమన్నారు. పోరాటాలకు తలొగ్గి రైతు వ్యతిరేక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని, విద్యుత్‌ ప్రైవేటీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటామని చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదని తెలిపారు. పెరుగుతున్న నిరుద్యోగం, ఉద్యోగాలు కోల్పోవడం, అధిక ధరల సమస్యలను కార్మికులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుతామని ప్రకటిస్తున్నాయని తెలిపారు. పరిశ్రమలకు, సంస్థలకు తనిఖీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేశాయని కార్మికుల ప్రాణాలను, భద్రతను, ఆరోగ్యాన్ని పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పణంగా పెట్టాయని విమర్శించారు. గౌరవ వేతనం, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, నిర్ణీత కాలపరిమితి ఉద్యోగాల పేర్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్మినెంట్‌ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులైన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌, ఓడరేవులు, రైల్వేలు, విద్యుత్‌, విమానాశ్రయాలు, ఎల్‌ఐసి, జాతీయ రహదారులను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే లీజుకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నులను తగ్గించి జిఎస్‌టి భారాలను ప్రజలపై మోపిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీల రూ.14 లక్షల కోట్ల బ్యాంకు బకాయిలను రద్దు చేసిందని, రైతుల బకాయిలను రద్దు చేయడానికి నిరాకరిస్తోందని తెలిపారు. ఇప్పటికే విద్యుత్‌ భారాలు మోపారని, స్మార్ట్‌ మీటర్లు పెట్టి విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెంచబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల అడుగులకు మడుగులొత్తుతోందని విమర్శించారు. మోడీ ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్‌, సహకార రంగాలను ప్రైవేటీకరిస్తోందన్నారు. విద్యుత్‌, ఇంటి పన్నులు, రవాణా ఛార్జీలను పెంచి కార్మికులపై భారాలు మోపిందని విమర్శించారు. షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్‌ కార్మికుల వేతనాలను సవరించడానికి నిరాకరిస్తోందని, బిల్డింగ్‌ కార్మికుల సంక్షేమ నిధులను దారిమళ్లించి పథకాలను నిలిపేసిందన్నారు. బిజెపి విషపూరిత మతతత్వ విధానాలను ఎదిరించడానికి అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు సిద్ధపడడం లేదని చెప్పారు. ధరలను నియంత్రించాలని, ఆహారం, మందులు, వ్యవసాయ ఉపకరణాలపై జిఎస్‌టి రద్దు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌పై ఎక్సైజ్‌ పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, వెలుగు తదితర స్కీమ్‌వర్కర్లు, ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, పెన్షన్‌, గ్రాట్యుటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలని కోరారు. భవన నిర్మాణం, హమాలీ, ఆటో, రవాణా రంగం తదితర అసంఘటిత కార్మికులకు సమగ్ర సామాజిక సంక్షేమం అమలు చేయాలన్నారు. కనీస ఇపిఎస్‌ పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 8న నుంచి చేపడుతున్న నిరవధిక సమ్మెకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈనెల 11, 12 తేదీల్లో కలెక్టరేట్‌ దగ్గర ఆశావర్కర్లు చేపట్టే 36 గంటల ధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కె.నాగమణి, ఎ.మహాలక్ష్మి, కె.కళ్యాణి, కె.సూరయ్య, జి.అమరావతి, బి.ఉత్తర, ఎన్‌.వి రమణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️