ఓటర్ల జాబితా నవీకరణలో అప్రమత్తం

ఓటర్ల జాబితా తుది పబ్లికేషన్‌ తర్వాత చేర్పులు, మార్పులు ఇతర సవరణల

విసిలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఓటర్ల జాబితా తుది పబ్లికేషన్‌ తర్వాత చేర్పులు, మార్పులు ఇతర సవరణల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సూచించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా నవీకరణ తదితర అంశాలపై అదనపు సిఇఒలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్‌.హరీంధర్‌ప్రసాద్‌లతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ జిల్లాకు సంబంధించిన ఎన్నికల సంసిద్ధత ప్రణాళికను వివరించారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 17 వేల దరఖాస్తులను రోజు వారి పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. ఎన్నికల విధులకు అవసరమయ్యే సిబ్బందిని నియమించడానికి శాఖల వారీ ఉద్యోగుల డేటాఎంట్రీ పూర్తి చేసినట్లు చెప్పారు. ఎన్నికల బందోబస్తు, రవాణా వాహనాలు, రూట్‌ మ్యాప్‌లో తదితర అంశాలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. సిబ్బందికి తుది దశ ఎన్నికల శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. జిల్లాలో 597 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఆయా గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలను కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. సమావేశంలో జెసి ఎం.నవీన్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జె.వి.ఎస్‌.రామ్మోహనరావు, ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య, ఉప కలెక్టర్‌ పద్మావతి, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, జిల్లా పరిషత్‌ సిఇఒ వెంకటేశ్వరరావు, సిపిఒ లక్ష్మీప్రసాదన్న, సి-సెక్షన్‌ డిటి చక్రవర్తి పాల్గొన్నారు.

 

➡️