కను(మ)విందు

Jan 16,2024 21:24 #కను(మ)విందు
సంక్రాంతి పర్వదినాల్లో చివరి రోజైన కనుమ పండగ జిల్లాలో భలే పసందుగా సాగింది. పల్లెల్లో గోసేవ నిర్వహించి ఆవులకు పొంగళి

టెక్కలి రూరల్‌ : రద్దీగా ఉన్న మటన్‌ షాపు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌, టెక్కలి రూరల్‌

సంక్రాంతి పర్వదినాల్లో చివరి రోజైన కనుమ పండగ జిల్లాలో భలే పసందుగా సాగింది. పల్లెల్లో గోసేవ నిర్వహించి ఆవులకు పొంగళి తినిపించడం ఈవేడుక ప్రత్యేకత. దీనికి తోడు మాంసాహార, మద్యం ప్రియులకు ఈ వేడకల్లో పట్టలేని ఆనందం. మంగళవారం కనుమ కావడంతో మాంసాహారులను ఆపటం ఎవరి తరం కాలేదు. అన్‌స్టాప్‌బుల్‌గా ఆరగించేశారు. సాయంత్రం సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్లు, ఆలయాలను సందర్శించి ఆహ్లాదంగా గడిపారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించిన యాత్రలకు పెద్దఎత్తున జనం హాజరై సందడి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు చేరిన వారంతా ఈవేడుకల్లో బాగస్వాములయ్యారు. పండగల పసందు కనుమ విందుతో ముగిసింది. కనుమ, పైగా మంగళవారం కావడంతో మాంసం విక్రయాలు జోరుగా సాగాయి. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా అన్నిచోట్లా మాంసాల కొనుగోళ్లతో ఆ దుకాణాలు రద్దీగా మారాయి. మాసం ధర గతేడాది, ఈ ఏడాది రూ.వెయ్యికే విక్రయించారు. కోడి మాంసం ధర కిలో రూ.170 నుంచి రూ.210కి పెంచి విక్రయించారు. చేపల ధరలూ సైజు బట్టి పెరిగాయి. విందులో మందు మద్యం ప్రియులు ఈ వేడుకల్లో ఆనందడోలికల్లో తేలియాడారు. చుక్క ముక్కతో తెగ ఆనందించారు. జిల్లాలో 192 మద్యం షాపులు, 23 బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో సుమారు రూ.3.50 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈ ఏడాది డిసెంబరు 31న రూ.6.04 కోట్ల మద్యం విక్రయాలు సాగాయి. నెలకు రూ.80 కోట్ల నుంచి రూ.135 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. సంక్రాంతి పర్వదినాలైన ఈ మూడు రోజుల్లో సుమారు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వ్యాపారం సాగుతుందని అధికారులు అంచనా వేశారు. మద్యం అమ్మకాల్లో అత్యంత కీలకంగా కనుమ రోజును భావిస్తారు. అదేస్థాయిలో అమ్మకాలు సాగాయని అధికారులు చెబుతున్నారు. బుదవారం ముక్కనుమ కావడంతో మరింత విక్రయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. జనవరి 9 నుంచి ప్రభుత్వ పాఠశాలకు సెలవులు వచ్చాయి. ఈనెల 19న తిరిగి పాఠశాలలు తెరవనుండడంతో చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు సెలవు రావడం, కనుమ విందుకు అనువైన రోజులు కావడంతో మద్యం విక్రయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా సాగాయి. అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో రోజుకు రూ.3.50 కోట్ల మద్యం విక్రయాలు సాగుతుండగా, కనుమ రోజు ఆ అమ్మకం మూడు రెట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే కనుమ రోజున మద్యం ప్రియులు జిల్లాలో రూ.10 నుంచి 12 కోట్ల మద్యం వ్యాపారం సాగుతుందని అంచనా. కనుమ రోజున పలురకాల కార్యక్రమాల్లో పాల్గొని ఆనందించారు. కొత్త సినిమాలను చూసేందుకు జనం ఎగబడ్డారు. హనుమాన్‌, గుంటూరు కారం, నా స్వామిరంగ, సలార్‌, వంటి పెద్ద సినిమాలతో పాటు సినిమాలకు జనం క్యూకట్టారు. దీంతో థియేటర్ల ప్రాంగణాలన్నీ జన సందోహంగా మారాయి. కొత్త సినిమా టిక్కెట్లు దొరకని వారు, పక్కనే ఉన్న మరో థియేటర్లలో ప్రదర్శిస్తున్న సినిమాలకు వెళ్లి కాలక్షేపం చేశారు. చిన్నారులు పార్కులకు వెళ్లి ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. పలువురు ఆలయాలను సందర్శించారు.జన జాతరకనుమ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జాతరలు నిర్వహించారు. జాతర్లకు పిల్లా పాపలు, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆమదాలవలస ప్రాంతంలోని సంగమేశ్వర ఆలయ ప్రాంతంలో నిర్వహించిన జాతరకు సమీప ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం పెద్దపాడు అప్పనమ్మతల్లి దేవాలయం వద్ద నిర్వహించిన జాతరకు పెద్దఎత్తున పాల్గొన్నారు. పాతపట్నం మండలం నీలమణిదుర్గమ్మ దేవాలయం సందర్శనకు సందర్శకులు పోటెత్తారు. నరసన్నపేట మండలం జల్లువానిపేటలోని దానప్పతల్లి దేవాలయాలు కిటకిటలాడాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశా నుంచి భారీగా జనం తరలివచ్చారు.

 

➡️