కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి

ఏళ్ల తరబడి గుర్తింపులేని జాతిగా మిగిలిపోతున్న బెంతు ఒరియాలు ఇంకెన్నాళ్లు వివక్ష ఎదుర్కోవాలని బెంతు ఒరియాలు

ఇచ్ఛాపురం : ఆందోళన చేస్తున్న బెంతు ఒరియాలు

ప్రజాశక్తి- కవిటి

ఏళ్ల తరబడి గుర్తింపులేని జాతిగా మిగిలిపోతున్న బెంతు ఒరియాలు ఇంకెన్నాళ్లు వివక్ష ఎదుర్కోవాలని బెంతు ఒరియాలు ప్రశ్నించారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత 22 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న వీరు గురువారం కవిటి కొత్తూరు పెట్రోల్‌ బంకు వద్ద భారీ బైక్‌ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం కవిటి, ఇచ్ఛాపురం, కంచిలి చేరుకుని అక్కడ తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. తమ సమస్యలకు శాశ్విత పరిష్కారం చూపించి, తమ బిడ్డల భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. అదేవిధంగా కవిటి బస్టాండులో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు, పొందల కృష్ణారావు, బెందాళం రమేష్‌, పూడి ప్రసాదరావు, ఎన్ని అశోక్‌, కొర్రాయి వాసుదేవ్‌ తదితరులు పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు.ఇచ్ఛాపురం : బెంతుఒరియా కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం ధర్నా చేపట్టారు. ముందుగా పట్టణంలో ర్యాలీలు, మానవహారం చేపట్టారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ గోవిందరావు, కవిటి ఎస్‌ఐ రాము ఆధ్వర్యాన పోలీస్‌ సిబ్బంది భారీగా చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం తహశీల్దార్‌ గురుప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శివ బిసాయి, మోహన్‌ బిసారు, రజనీ కుమార్‌ దోలయి, సుమన్‌ బిశాయి, బృందావన్‌ బిసాయి, మేఘనాథ్‌ పాల్గొన్నారు.

 

➡️