కోవిడ్‌ కలకలం

జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో మూడు కోవిడ్‌ కేసులు

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని పరిశీలిస్తున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి

  • జిల్లాలో మూడు కేసులు నమోదు
  • అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ అధికారులు
  • సర్వజన ఆస్పత్రిలో 20 పడకలుఏర్పాటు

కోవిడ్‌ రూపాంతరం మార్చుకుని కమ్ముకొస్తోంది. కనుమరుగైందనుకున్న మహమ్మారి మళ్లీ కోరలు చాచే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో మూడు కేసులు నమోదు కావడం కలకలం సృష్టించింది. కోవిడ్‌ కేసులు వెలుగు చూస్తుండడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శీతాకాలం, పండగల సీజన్‌ అయిన ప్రస్తుత తరుణంలో తాజా హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తం కావాల్సి ఉంది. మాస్కు ధారణ, భౌతిక దూరం, శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో మూడు కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మెళియాపుట్టి మండలం దుర్భలాపురానికి చెందిన 73 ఏళ్ల వ్యక్తి కోవిడ్‌ లక్షణాలతో ఈనెల 16న శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. విటిఎం పరీక్షలు నిర్వహించగా, ఈనెల 24వ తేదీన కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం సర్వజన ఆస్పత్రి కోవిడ్‌ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోవిడ్‌ వేరియంట్‌ నిర్ధారణ కోసం విజయవాడలోని ల్యాబ్‌కు పంపారు. సోమవారం మరో ఇద్దరు కోవిడ్‌ బారిన పడ్డారు. కొత్తూరు మండలం కుద్దిగాంకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి, శ్రీకాకుళం నగరం కంపోస్టు కాలనీకి చెందిన 50 ఏళ్ల మహిళకు కోవిడ్‌ సోకింది. వీరిద్దరికీ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కోవిడ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్త మయ్యారు. సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేకంగా 20 పడకలను ఏర్పాటు చేశారు. కోవిడ్‌ లక్షణాలతో వచ్చే వారికి వెంటనే పరీక్షలు, చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, న్యుమోనియా ఇబ్బందులున్న వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి బి.మీనాక్షి సోమ వారం సర్వజన ఆస్పత్రిలో పర్యటించి కోవిడ్‌ ప్రత్యేక వార్డులు, పరీక్షలను పరిశీలించారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పడకల సంఖ్యను మరింత పెంచుతామని చెప్పారు. కోవిడ్‌ పరీక్షల సంఖ్యను మంగళవారం నుంచి పెంచుతామని తెలిపారు.కోవిడ్‌ పరీక్షలు పెంచాలికోవిడ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వపరంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌ లక్షణాలున్న వారితో పాటు వారి కాంటాక్టును గుర్తించి పరీక్షలు చేయాలి. ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న వైద్య సిబ్బందితో కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి సచివాలయం పరిధిలో పరీక్షలు ఉధృతం చేయాలి. జిల్లా సర్వజన ఆస్పత్రితో పాటు అన్ని ఆస్పత్రుల్లో పడకలను అందుబాటులోకి తీసుకురావాలి. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు, కాన్సన్‌ట్రేటర్లు ఇతర వైద్య పరికరాలను వినియోగంలోకి తీసుకురావాలి. కోవిడ్‌ వ్యాప్తి విస్తృతం కాకుండా సచివాలయ వైద్య సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది.జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పేకోవిడ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. క్రిస్మస్‌, సంక్రాంతి తరుణంలో ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు ఊపందుకోనున్నాయి. బస్సులు, రైళ్లు రద్దీగా మారనున్నాయి. మార్కెట్లు, వస్త్ర దుకాణాలు జనంతో కిటకిటలాడనున్నాయి. అయ్యప్ప మాలధారణ వేసిన వారు కేరళ వెళ్లి వస్తున్నారు. కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్‌ వ్యాప్తికి శీతాకాలం అనుకూలమైనందున వీలైనంత మేర అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్‌ ఏ రకమైనా సరే… మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత రాకపోకలు తగ్గించుకోవాలని చెప్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే సత్వరమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. ఫలితాలు వచ్చే వరకు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండడం ద్వారా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని చెప్తున్నారు.దుర్భలాపురంలో వైద్య పరీక్షలుమెళియాపుట్టి : మండలంలోని దుర్భలాపురంలో కోవిడ్‌ కేసు నమోదు కావడంతో వైద్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్‌ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తచర్యలను వివరించారు. గ్రామంలో ఎవరికీ జ్వరాలు, జలుబు లక్షణాల్లేవని స్థానిక వైద్యాధికారి గ్రీష్మ తెలిపారు.

 

➡️