క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం

మారుతున్న ఆహారపు

విజేతకు బహుమతి అందజేస్తున్న క్లబ్‌ సభ్యులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మారుతున్న ఆహారపు అలవాట్లు నేపథ్యంలో క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జెకెసి సంస్థ అధినేత జల్లేపల్లి గిరిధరరావు అన్నారు. విజయవాడలో ఫన్‌ టైం క్లబ్‌ నిర్వహించిన రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ పోటీల్లో మొదటి బహుమతి సాధించిన సందర్భంగా కాస్మోపాలిటిన్‌ క్లబ్‌ ప్రతినిధులు గురువారం ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 70 ఏళ్ల పైబడిన కేటగిరీలో రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ పోటీల్లో పాల్గొని మొదటి స్థానం సాధించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. ఈ ర్యాంకింగ్‌ ఏడాది పాటు ఉంటుందని తెలిపారు. ఏడాదిన్నరగా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధిస్తున్నానని, దానికి క్లబ్‌ ప్రతినిధులు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ డిఇఇ ఎం.వి.సురేష్‌ మాట్లాడుతూ మిక్స్‌ డ్‌ డబుల్స్‌ విభాగంలో ఛాంపియన్‌గా నిలవడం, డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. కోచ్‌ ఈశ్వర్‌ యాజి అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ సెక్రటరీ సురంగి మోహనరావు, జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ చింతాడ కృష్ణమోహన్‌, ట్రెజరర్‌ జి.సత్యంనాయుడు, ఎ.సెల్వన్‌, ఎటిఒ పి.గోగరాజు, ఎం.వి.రమణలు, వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావు పాల్గొన్నారు.

 

 

➡️