క్లాప్‌ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

నగరపాలక సంస్థ పరిధిలో

సమస్యలు వివరిస్తున్న తేజేశ్వరరావు

  • కమిషనర్‌ను కోరిన సిఐటియు నాయకులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం కార్పొరేషన్‌ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియాను కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లాప్‌ డ్రైవర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సక్రమంగా అమలు చేయాలన్నారు. ప్రతినెలా క్లాప్‌ వెహికల్‌ యాజమాన్యం, యూనియన్‌తో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ సెలవు దినాలను అమలు చేయడంతో పాటు డ్రైవర్లందరికీ యూనిఫామ్‌, గుర్తింపుకార్డులు ఇవ్వాలని, క్యాజువల్‌ లీవ్‌లు అమలు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో క్లాప్‌ వెహికల్‌ డ్రైవర్లు రామకృష్ణ, తేజ, కిరణ్‌ తదితరులున్నారు.

➡️